పోలవరంపై కేంద్రం రాష్ట్రాన్ని చివాట్లు పెడుతూ లేఖ రాస్తే మాట్లాడకూడదట..

పోలవరంపై కేంద్రం రాష్ట్రాన్ని చివాట్లు పెడుతూ లేఖ రాస్తే మాట్లాడకూడదట.. - Sakshi


ఎక్కడైనా కరువు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వేర్వేరుగా ఉంటాయా? 1,500 అడుగులు బోర్లు వేస్తే నీళ్లు పడని పరిస్థితి. అయినా, అర్ధగంట కూడా కరువు చర్చ జరగనివ్వరు. 25నిమిషాలు మాట్లాడితే ఒక గంట పదిహేను నిమిషాలు అవరోధాలు కల్పిస్తారు. పోలవరంపై ఆ ప్రాజెక్టు అథారిటీ సీఈవో దినేష్‌కుమార్ ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని చివా ట్లు పెడుతూ లెటర్ రాశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కేవలం రెండు శాతం మట్టి పని మాత్రమే చేశారని, ప్రాజెక్టు పనులు పూర్తి చేసే చిత్తశుద్ధి కాంట్రాక్టు సంస్థకు లేదని లేఖ రాస్తే, కాంట్రాక్టరు.. తరం కానివాడు, అన్యాయస్తుడు అని తెలిసినా చంద్రబాబు కమీషన్లు తీసుకుని రూ.290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. ఇంతవరకు కాంట్రాక్టరు రూ.220 కోట్లు పనిచేశారు. రూ.5వేల కోట్ల పనులు ఏడాదికి చేస్తే తప్పించి మూడేళ్లలో పోలవరం పూర్తి కాదు. అయినా, దీనిపై అసెంబ్లీలో మాట్లాడకూడదట. టాపిక్ తేవద్దట.. ఇదీ ప్రభుత్వ వైఖరి.



 పట్టిసీమపై పార్టీ వైఖరి ఎప్పుడో చెప్పాం

 ‘‘చంద్రబాబు నేను సభలో లేనప్పుడు పట్టిసీమ ప్రాజెక్టుపై మాట్లాడారు. మా వైఖరి ఏమిటో  బాగా ఆలోచించుకుని చెప్పమని  వెటకారంగా మాట్లాడారట. గత అసెంబ్లీలోనే రెండు రోజులు పట్టిసీమపై చర్చ జరిగినప్పుడే వ్యతిరేకమని స్పష్టం చేశాం. పట్టిసీమపై మా పార్టీ వైఖరి సుదీర్ఘంగా, సవివరంగా చెప్పాం. ఎందుకంటే నీటిని స్టోరేజీ చేసే అవకాశం లేనందున పట్టిసీమపై పెట్టే ఖర్చు వృథా. పోలవరం పూర్తయితే దీనికి వెచ్చించిన రూ.1,600 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. ఇదే డబ్బును గాలేరు-నగరిలో పెట్టినా.. హంద్రీనీవాలో పెట్టినా.. పులిచింతలలో పెట్టినా.. వెలిగొండలో పెట్టినా ప్రాజెక్టులు పూర్తవుతాయి. పట్టిసీమ టెండర్లలో విపరీతమై గోల్‌మాల్ జరిగింది. టెండర్లలో పాల్గొన్నది కేవలం ఇద్దరే. ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేనట్లు ఇద్దరే ఇద్దరు పాల్గొన్నారు. వారికి 16.9 శాతం బోనస్ ఇచ్చారు. సంవత్సరంలోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి టెండర్లు పిలిచారు. మరి అదే సంవత్సరంలో పూర్తి చేస్తే బోనస్ ఎందుకు? బోనస్ క్లాజ్ అన్నా టెండర్లు పిలిచేటప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లు ఉందా అంటే అదీ లేదు. టెండర్లు కోట్ చేసిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ 21.9 శాతం కోట్ చేస్తే 5 శాతం పర్మిసబుల్ లిమిట్ అని చెప్పి 16.9 శాతం బోనస్‌గా ఇచ్చారు. ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు.  30 పంపులు.. 15 పైప్‌లైన్లు ఉంటే, 24 పైపులు.. 12 పైప్‌లైన్లకు తగ్గించారు. స్టీల్, అల్యూమిని యం ధరలూ తగ్గాయి. దీనివల్ల రూ.250 కోట్లు తగ్గాలి. డిజైన్లు మార్చడం వల్ల రేటు పెరిగింది అని కాంట్రాక్టర్ ప్రతిపాదన ఇవ్వడం.. దీన్ని చంద్రబాబు అనుమతించ డం.. దోచుకోవడానికే’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.



కృష్ణా జలాలను దారుణంగా కోల్పోతాం..

గోదావరి వాటర్ ట్రిబ్యునల్ 7(ఇ) ఏం చెబుతుందంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో సంబంధం లేకుండా కేంద్ర జలవనరుల సంఘం అనుమతి ఇచ్చిన వెంటనే 80 టీఎంసీలలో 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాటా తీసుకుంటాయి. మనకు రావాల్సిన కృష్ణా జలాల్లో ఎగువనే ఈ నీటిని తీసుకుంటాయి. మిగిలిన 45 టీఎంసీలలో తెలంగాణ వాటా కోరితే కొత్త వివాదం వస్తుంది. 7(ఎఫ్) ఏం చెబుతుందంటే.. 80 టీఎంసీలకు మించి గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిలోనూ ఇదే దామాషాలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఎగువ రాష్ట్రాలకు తాను చెబితే తప్ప తెలియదని చంద్రబాబు అంటారు. గోదావరి ట్రిబ్యునల్ రూల్స్ వారికి తెలియవా? కృష్ణా, గోదావరి బోర్డుల దగ్గరకు పోయినప్పుడు ఈ అంశం చర్చకు రాదా? ప్రాజెక్టు వివాదంలోకి పోదా? సంజీవని లాంటి పోలవరం వల్లనే రాయలసీమకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది.



 రాయలసీమపై ప్రేమ కాదు.. నాటకాలు....

 ‘రాయలసీమ మీద ప్రేమ ఉందా’ అని చంద్రబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పట్టిసీమ కట్టేటప్పుడు చెప్పా. ‘జీవో నెంబరు 1లో రాయలసీమకు నీళ్లిస్తానని, కృష్ణా ఆయకట్టుకు నీళ్లిస్తానని రాశారా?.. కేపిటల్ సిటీకి డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్’ అని పేర్కొన్నారు. . పోలవరం ముద్దు.. పట్టిసీమ వద్దు అని చెప్పడానికి ఇన్ని కారణాలు చెప్పాం’’ అని  జగన్ పునరుద్ఘాటించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top