కలపొద్దు మహాప్రభో

కలపొద్దు మహాప్రభో - Sakshi


 సాక్షి, ఏలూరు:‘ఎవరినడిగి మమ్మల్ని తెలంగాణ నుంచి విడగొడుతున్నారు.. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు.. పోల వరం కట్టుకుంటారో.. రాష్ట్రాన్ని ముక్కలు చేసుకుంటారో మీ ఇష్టం.. ఆ రెండింటి వల్ల మా బతుకులు బండలైతే సహించం’ అంటూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గిరిజనులు గళమెత్తారు. వేట కొడవళ్లు, విల్లంబులు చేతబూని శనివారం ఏలూరు నగర వీధుల్లో కవాతు చేశారు. డప్పు వాద్య విన్యాసాల నడుమ సంప్రదా య నృత్యాలు చేస్తూ, గీతాలు ఆలపిస్తూ  నిరసన వ్యక్తీకరించారు. పోలవరం ముంపు మండలాలను ఉభయగోదావరి జిల్లాల్లో కలపొద్దని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముంపు మండలాల విలీనంపై అభ్యంతరాలుంటే ఆగస్టు 30లోపు తెలియజేయూలంటూ జిల్లా కలెక్టర్ కోరిన నేపథ్యంలో వేలాది మంది గిరిజనులు తమ అభిప్రాయం చెప్పడానికి వచ్చారు. గిరిజనుల తరపున సీపీఐ (ఎంఎల్-న్యూడెమోక్రసీ) నాయకులు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌ను కలిసి అభిప్రాయాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు.

 

 విడదీస్తే కష్టాలే

 నగరంలోని ఫైర్‌స్టేషన్ సెంటర్‌నుంచి గిరిజనులు కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి సంప్రదాయ నృత్యాలు, గీతాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ ఒక్క ఖమ్మం జిల్లాలోనే 7 మండలాల్లో 2లక్షల మంది జనాభా, 50వేల హెక్టార్ల అభయారణ్యం, పాపికొండలు ముంపునకు గురవుతుంటే దేశంలో ఎక్కడా లేనివిధంగా వీటిని తెలంగాణ రాష్ర్ట్రం నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ చట్టం చేశారని వాపోయారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 తమను తెలంగాణ నుంచి విడదీయడం వల్ల పరిపాలనా సౌలభ్యం కోల్పోయి ఇబ్బందులు ఎదురవుతాయని, వనరులు, హక్కులు కోల్పోతామని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టమన్నారు. ఆంధ్రాలో కలుస్తున్న 7 మండలాల ప్రజలు ఏ సమస్య వచ్చినా ఏలూరు లేదా కాకినాడ రావాలంటే దూరాభారమన్నారు. అధికారులు కూడా మండలాలకు రాలేరన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆదివాసీల అభివృద్ధికి అవరోధమన్నారు. నిపుణుల సూచనలు, ప్రత్యామ్నాయాలను నిరాకరించి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయూలని కోరారు. రాజ్యాంగాన్ని, ఆదివాసీ చట్టాలను కాపాడాల్సిన పాలకులే వాటిని ధిక్కరించడం అన్యాయమని గిరిజన నాయకులు పేరొకన్నారు.

 

 రాష్ట్రాన్నే కాదు.. గిరిజనుల్నీ చీల్చారు

 సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా శాఖ కార్యదర్శి పి.రంగారావు, అఖిల భారత రైతు, కూలీ సంఘం (కేఐఎంఎస్) తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చామంటూ ఢిల్లీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంతోపాటు గిరిజనులనూ నిలువునా చీల్చిందన్నారు. 1984లో జారీ చేసిన జిల్లాల ఏర్పాటు ఉత్తర్వుల ప్రకారం ప్రజాభిప్రాయం ఆధారంగా చట్టాల రూపకల్పన చేయాలని, అవేమీ చేయకుండా పాలకులు నిరంకుశంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గా లు వెతకాలని లేదంటే డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు.

 

 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో జీవించిన ఆదివాసీలు నిర్వాసితులుగా సీమాంధ్రలో మనలేరన్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు కడితే పాపికొండలు సహా వందలాది గిరిజన గ్రామాలు ముంపుబారిన పడతాయని, డిజైన్ మార్చడం లేదా ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల వైపు మళ్లడం జరిగేంత వరకూ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పశ్చిమగోదావరి జిల్లా శాఖ నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వరావు, కుక్కునూరు మండల నాయకుడు ఎస్‌కే గౌస్, బశినేని సత్యనారాయణ, వేలేరుపాడు నాయకుడు పూరెం లక్ష్యయ్య పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top