స్మార్‌‌టగా మున్ముందుకు..

స్మార్‌‌టగా మున్ముందుకు..


 ప్రతి సెంటు భూమికి సాగునీరు

 9.70 లక్షల గృహాలకు ఎల్‌ఈడీ బల్బులు

 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

 38 పరిశ్రమలతో 11వేల మందికి ఉద్యోగాలు

 జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు

 భవిష్యత్ కోసం పునరంకితమవుదాం




 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :ప్రతి గ్రామాన్ని, వార్డుని ఆకర్షణీయంగా మార్చి రాష్ట్రంలోనే స్మార్ట్ జిల్లాగా పశ్చిమగోదావరిని తీర్చిదిద్దేందుకు యం త్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, ఈ ఘనత సాధించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 66వ భారత గణతంత్ర దినోత్సవంలోఆయన జెండా వందనం చేసి జిల్లా ప్రజలకు సందేశమిచ్చారు. ఆయన మాట్లాడుతూ భావితరాల బంగారు భవిష్యత్ కోసం పనిచేసేందుకు ప్రతి ఒక్కరం పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మన ముందు ఎన్నో సవాళ్లున్నాయని, అయితే రాష్ట్రాన్ని సొంతంగా నిర్మించుకోగలగడం ఇప్పటి తరాలకు అందిన బృహత్తర అవకాశంగా చెప్పుకోవాలన్నారు. ఈ అంశం ప్రస్తుతం మన బాధ్యతను రెట్టింపు చేస్తుందన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా అటు వ్యవసాయకంగా, ఇటు పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో బాధ్యతగల పాత్ర పోషిం చాల్సి ఉంటుందన్నారు. దీనికి తగ్గట్టుగానే జిల్లాలో ప్రతి రైతూ ఒక శాస్త్రవేత్తగా రూపొందుతున్నారని ప్రశంసించారు. నిట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వంటివి జిల్లాలో కొలువుతీరనున్నాయని, ఈ కారణంగా ఎన్నో మౌలిక వసతులు ఏర్పడతాయన్నారు.

 

 ఐదు ఉద్యమాలతో అభివృద్ధి

 పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, నీరు - చెట్టు, బడి పిలుస్తోంది, పరిశుభ్రం - ఆరోగ్యం అనే ఐదు ఉద్యమాలతో వివిధ రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజలను ై ప్రభుత్వం చెతన్య పరుస్తోందన్నారు. గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, ఫైబర్ ఆప్టికల్ గ్రిడ్, పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్‌లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామన్నారు. రుణమాఫీ పథకం కింద 3 లక్షల 54వేల మంది రైతులకు రూ. 1195 కోట్లను లబ్ధిగా అందిస్తున్నామని, వ్యవసాయ రుణాలు అందించేందుకు రూ.5,220 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు.

 

 పింఛన్లతో భరోసా

 వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.200 నుంచి రూ. 1000కి, అంగవైకల్య శాతం 80 శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి రూ.500 నుంచి రూ.1500కి పింఛను మొత్తం పెంచి వారిలో ప్రభుత్వం భరోసా నింపిందన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 3.32 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా రూ.38 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఆధునిక వరి నూర్పిడి యంత్రాలను రూ. 10 లక్షల సబ్సిడీపై, డ్రయర్లను 75 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామన్నారు. లక్ష మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించామని, రూ.25 కోట్లతో సూక్ష్మసేద్య పథకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు.

 

 కొత్తగా 74,487 మందికి ఓటుహక్కు

 74 వేల 487 మంది కొత్తగా ఓటుహక్కు పొందారని దీనితో జిల్లాలో ఓటర్ల సంఖ్య 29 లక్షల 18 వేల 587కు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్‌సీ కార్పొరేషన్ ద్వారా రూ.42 కోట్లతో స్వయం ఉపాధి పథకాలు, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.122 కోట్లతో 11 వేల మందికి వివిధ ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. భారీ పరిశ్రమల ఏర్పాటు  పూర్తై సుమారు 11 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది జూలై 14వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి డి.లీలావతి, మొదటి అదనపు జిల్లా జడ్జి వై.లక్ష్మణరావు, రెండవ అదనపు జిల్లా జడ్జి ఎ.హరిహరనాథ శర్మ, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. కృష్ణారెడ్డి, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, జాయింట్ కలె క్టర్ పి.కోటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీఓ ఎన్.తేజ్‌భరత్, జిల్లా పౌరసరఫరాల అధికారి కె.శివశంకరరెడ్డి, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చ్‌ఫాస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 2వ ప్లాటూన్ దళానికి కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందించారు.

 

 9.70 లక్షల గృహాలకు ఎల్‌ఈడీ బల్బులు

 మెరుగైన విద్యుత్ సరఫరాకు రూ. 19 కోట్లతో 68 విద్యుత్ ఉప కేంద్రాలను ఆధునీకరిస్తున్నామని, విద్యుత్ పొదుపు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 9.70 లక్షల గృహాలకు ఎల్‌ఈడీ బల్బులను త్వరలో అందిస్తామన్నారు. పోలవరంను 2018 నాటికి పూర్తి చేసేలా పనులను ముమ్మురం చేశామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 851 కోట్ల విలువైన 1,36,632 పనులను గుర్తించామని, 1.63 లక్షల కుటుంబాలకు 51 లక్షల పనిదినాలు కల్పించి రూ. 86 కోట్లను వేతనాలుగా అందించామన్నారు. స్వచ్ఛ భారత్ కింద మార్చి నాటికి లక్ష మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని, నీరు చెట్టు కార్యక్రమం కింద రూ.38 కోట్లతో 1108 జల సంరక్షణ పనులను చేపట్టామని కలెక్టర్ వివరించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రమాణాలతో కూడిన ఉత్తీర్ణతా శాతాన్ని సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 36 వేల మంది విద్యార్థులకు ప్రీ, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలుగా రూ. 37 కోట్లను మంజూరు చేశామని, తొమ్మిది సమీకృత వసతి గృహాలు మంజూరు చేశామని చెప్పారు. తొమ్మిది లక్షల మందిని రెండు దశల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top