వంద కోట్లతో సరి


 ఉభయగోదావరి.. కృష్ణా.. విశాఖ జిల్లాల కలల జల సౌధం పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విదిల్చింది. జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించినా.. బడ్జెట్‌లో మాత్రం ఆ స్థాయిలో కేటాయింపులు ఇవ్వలేదు. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులు కేంద్రం నుంచి అందుతాయని.. పనులు వేగవంతమవుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూశారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రూ.16 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, ఇప్పటివరకూ రూ.3 వేల కోట్లను వెచ్చించారు. ఇంకా రూ.13 వేల కోట్లు అవసరం కాగా, కేంద్రం విదిల్చిన రూ.100 కోట్లు ఏ మూలకూ సరిపోవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదేరకంగా నిధులు కేటాయిస్తే మరో వందేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 పోలవరం/ఏలూరు :బహుళార్థ సాధక పథకమైన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. శనివారం పార్లమెం టులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే అంతంతమాత్రంగా నడుస్తుండగా, మొక్కబడి కేటాయింపుల వల్ల ఈ బృహత్తర పథకం మూలనపడినట్టేనని.. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచినట్టేనని రైతులు, జల వనరుల నిపుణులు, ఇంజినీర్లు నిట్టూరుస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించటంతో సంబరపడిన రాష్ట్ర ప్రజలను కొద్ది రోజులకే పాలకులు నిరాశకు గురిచేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్ల నిధులతో పనులు ఏ మాత్రం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. దీనికి నిధులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి చేయలేకపోయిందని రాజకీయ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినా కనీస స్థాయిలో నిధులు కేటాయించకపోవడాన్ని చూస్తే దీనిని పక్కన పెట్టినట్టేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

 

 ఏ మూలకు..: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.16 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇప్పటివరకూ రూ.3 వేల కోట్లు వెచ్చించారు. జాతీ య హోదా దక్కని పరిస్థితుల్లో గత ఏడాది ప్రాజెక్ట్ పనులకు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని అంతా భావించారు. విడతలవారీగా నిధులొస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆశించిన ప్రజలు తాజా కేటాయింపులతో భంగపడ్డారు. 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, హెడ్‌వర్క్స్ పనులు, కాలువల నిర్మాణం, అథారిటీ కమిటీ జీతభత్యాలను కేంద్రం కేటాయించిన  నిధుల నుంచే భరించాలి. ఈ పరిస్థితుల్లో రూ.100 కోట్లు ఏ మూలకూ సరిపోవు.

 

 ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్లు

 ప్రాజెక్ట్ పనులను కొనసాగించాలంటే రానున్న నాలుగేళ్లలో కనీసం రూ.4వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఈ లెక్కన ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి. రాష్ట్ర విభజన తరువాత ఈ ప్రాజెక్టు ఆవశ్యకత మరింత పెరిగింది. ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తీర్చటంతోపాటు, రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చగలిగేది పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. ఇటీవల ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన అథారిటీ కమిటీ ప్రతినిధులు పనులను వేగవంతం చేయాలని, నిధులు మంజూరవుతాయని చెప్పినా అది కూడా నెరవెరలేదు. ప్రాజెక్టు పనులు వేగవంతం కావాలంటే ముందుగా 7 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఆ గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు.


కొనసాగిస్తారా..! : పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకొచ్చామని.. 2018 నాటికి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని.. పుష్కలంగా నిధులొస్తాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలోనూ ప్రాజెక్ట్ విషయమై ఎన్నో హామీలు గుప్పించారు. చివరకు రూ.100 కోట్లు సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తారా.. లేక నిలిపివేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top