సీఎం సింగపూర్ పర్యటనకు పీఎంవో బ్రేక్

సీఎం సింగపూర్ పర్యటనకు పీఎంవో బ్రేక్


హైదరాబాద్: సింగపూర్ పర్యటనకు వెళ్లాలనుకున్న సీఎం చంద్రబాబుకు.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో) బ్రేక్ వేసింది. సింగపూర్ జాతిపిత, మాజీ ప్రధాని లీ క్వాన్ యీ మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులర్పించేందుకు సీఎం  బుధవారం రాత్రి 11 గంటలకు సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  అందుకు రాష్ట్ర అధికారులు కేంద్ర విదేశీమంత్రిత్వ శాఖ అనుమతి కోరారు. విదేశీ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి సీఎం చంద్రబాబు పర్యటన గురించి తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు అనుమతి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర కేబినెట్ కార్యదర్శిని ఫోన్‌లో సంప్రదించారు.



ప్రధాని మోదీ ఈ నెల 29న లీ క్వాన్ యీ అంత్యక్రియలకు హాజరవుతున్నారని, ఆ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయ బృందం వెళ్లరాదని ప్రధాని పేర్కొన్నట్లు కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర అధికారులకు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రధాని అనుమతిస్తే 29న ఆయనతో పాటు మీరు (చంద్రబాబు) వెళ్లవచ్చని కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశ ప్రధాని హోదాలో ఆ అంత్యక్రియలకు మోదీ హాజరవుతుండగా అంతకుముందే ఒక రాష్ట్ర సీఎం వెళ్లడానికి ఎలా అనుమతిస్తారనే ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రధాని అనుమతిస్తే ఆయనతో పాటు చంద్రబాబు సింగపూర్ వెళ్లే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top