మొక్కల కొను‘గోల్‌మాల్’పై పునర్విచారణ


విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉద్యానవన విభాగంలో జరిగిన మొక్కల కొను‘గోల్‌మాల్’ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. పునర్విచారణలో భాగంగా శనివారం పార్కు ఉద్యోగుల్ని అదనపు కమిషనర్ జి.నాగరాజు విచారించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్క్ సూపర్‌వైజర్ రామారావు రిటైరయ్యారు కాబట్టి కాస్తంత ఆలోచించండి’ అంటూ అధికారి సూచించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ‘మీరు ఏం చెబితే అదే రాసిస్తాం సార్..’ అంటూ ఉద్యోగులు సమాధానమివ్వడంతో అధికారి కంగుతిన్నట్లు సమాచారం. గతంలో విచారణ సందర్భంగా ఏం స్టేట్‌మెంట్ ఇచ్చారో ఉద్యోగులు డిటో అదే ఇచ్చినట్లు తెలుస్తోంది.



ఇదీ అసలు కథ...

గ్రేడ్-1 పార్క్ సూపర్‌వైజర్‌గా రామారావు గతంలో విధులు నిర్వర్తించారు. పార్కుల్లో పచ్చదనం కోసం 2011లో రూ.27 లక్షలతో మొక్కలు కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టారు. ప్లాంట్ ప్యారడైజ్ విజయవాడ, వెంకట నర్సరీ కడియపులంక నుంచి రూ.6 లక్షల విలువైన మొక్కలు కొనుగోలు చేసినట్లు చూపారు. కార్పొరేషన్ పార్కుల్లో పెంచిన మొక్కలే నర్సరీల నుంచి కొనుగోలు చేసినట్లు చూపుతూ మాయ చేస్తున్నారని మునిసిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ నాయకుడు ఆసుల రంగనాయకులు చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త విచారణకు ఆదేశించింది.



విచారణాధికారులుగా నియమితులైన అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జెడ్.శ్రీనివాసరావు నర్సరీ కాంట్రాక్టర్లను విచారించగా సూపర్‌వైజర్ కోరినమీదట తాము ఖాళీ బిల్లులు ఇచ్చామని, మొక్కల్ని సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. పార్క్ ఉద్యోగులు సైతం మొక్కలను కొనుగోలు చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణాధికారులు నివేదిక ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం రామారావు రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆయనకు రావాల్సిన ప్రయోజనాలను నిలుపుదల చేశారు. రామారావుపై ఏం చర్యలు తీసుకున్నారని తాజాగా లోకాయుక్త కార్పొరేషన్‌ను ప్రశ్నించడంతో పునర్విచారణ ప్రారంభించినట్లు సమాచారం.



ససేమిరా

లోకాయుక్తలో కేసు ఫైల్ చేసిన ఆసుల రంగనాయకులుతో పాటు, కాంట్రాక్టర్ల స్టేట్ మెంట్ ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. దీంతో వారిపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పునర్విచారణలో ఓ అధికారి సాయంతో బయటపడాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్కు ఉద్యోగుల నుంచి ఫిర్యాదుదారుడి వరకు నిక్కచ్చిగా ఉండటంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. అధికారులు చివరకు ఏం చేస్తారో వేచి చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top