ఫొటోలు తీస్తూ.. బావిలో పడి వ్యక్తి మృతి


గోవర్ధనగిరి(రఘునాథపల్లి) న్యూస్‌లైన్ : ఫొటోలు తీయూలనే సరదా ఒకరి ప్రాణం తీసింది. కుమారుడు ఈత నేర్చుకుంటుండ గా ఫొటోలు తీస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన సంఘటన మండలంలోని గోవర్ధనగిరిలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. సికింద్రాబాద్ లోని అడ్డగుట్టకు చెందిన బూర్గుల శ్రీనివాస్(34), సునీత దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు.



పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ఇటీవల భార్యా పిల్లలను గోవర్ధనగిరిలోని అత్తారింటికి పంపాడు. వారిని తిరిగి తీసుకెళ్లేం దుకు అతడు బుధవారం రాత్రి గోవర్ధనగిరికి వచ్చాడు. ఉదయమే సంతోషంగా అందరితో కలిసి భోజనాలు చేసిన శ్రీనివాస్ సమీపంలోని కన్న వెంకటయ్య వ్యవసాయ బావిలో కుమారుడు మైఖేల్‌కు ఈత నేర్పేందుకు భార్య సునీత, కూతురు కరుణప్రియతో కలిసి వెళ్లాడు.



అతడికి ఈత రానందున ఈత వచ్చిన భార్య కుమారుడికి ఈత నేర్పిస్తోంది. కూతురితో బావి గట్టుపై ఉండి బావిలో ఈత నేర్చుకుంటున్న దృశ్యాలను సరదాగా తన సెల్ కెమెరాలో బంధిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బండరారుు నుంచి కాలుజారి బావిలో పడ్డాడు. దీంతో ఆందోళనకు గురై భార్య వెంటనే తన చీర అందించబోగా దగ్గరకు రావొద్దంటూ అరుస్తూనే నీటిలో మునిగిపోయాడు.



దీంతో ఆమె కేకలు వేయడంతో విన్న స్థానికులు పరుగున వచ్చి బావిలో మునిగిన శ్రీనివాస్‌ను బయటకు తీశారు. అప్పటికే శ్రీనివాస్ మృతిచెందగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని  సికింద్రాబాద్ అడ్డగుట్టకు తీసుకెళ్లారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top