వ్యాట్ వాత.. ‘పెట్రో’ మూత

వ్యాట్ వాత.. ‘పెట్రో’ మూత - Sakshi


పాలకుల చేతగానితనం ప్రజలను కష్టాల పాలు చేస్తోంది. నిత్యావసరాలు మొదలు.. పెట్రోలు, డీజిల్ వరకు ఎందులో చూసినా రాష్ట్రంలో ధరలు మండుతున్నాయి. జనం గుండెను మండిస్తున్నాయి. వ్యాట్ భారంతో పెట్రోలు, డీజిల్ ధరలు రాష్ట్రంలో కొండెక్కి కూర్చొన్నాయి. వ్యాట్ మంట తగ్గించాలని కోరినా, పాలకులు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితిలో పెట్రోల్ బంక్‌ల యజమానులు బంద్ బాటపట్టారు.         

- జిల్లాలో 220 పెట్రోలు బంకులు మూత

- ఇబ్బడిముబ్బడిగా వ్యాట్‌తో వ్యతిరేకత

- పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరలకు పెట్రోలు, డీజిల్

- ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్

ఒంగోలు సబర్బన్ :
వ్యాట్‌పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలోని పెట్రోలు బంకుల యజమానులు 24 గంటల పాటు బంద్‌తో తమ నిరసనను తెలియజేసేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పెట్రోలు బంకుల ఆపరేటర్లు అందరూ ఒక్కతాటిపై నిలిచి ఒక్క రోజు బంకులు మూసేయాలని నిర్ణయించారు. ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పెట్రోలు బంక్‌లను మూసేస్తున్నారు. దీంతో జిల్లాలోని 220 పెట్రోలు బంకులు బంద్ కానున్నాయి.



మన రాష్ట్రంతో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో ప్రతి లీటరు డీజిల్, పెట్రోల్‌పై రూ.4 వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధించటమే. దీంతో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ధరలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ వాహనదారులు నామమాత్రంగా డీజిల్ కొట్టించుకొని ట్యాంకులు, ట్యాంకులు పక్క రాష్ట్రాల్లో నింపుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీ సంస్థలు పెట్రోలు బంకులు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. ప్రతి రోజూ లక్షల కొద్దీ లీటర్లు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే లీటరుకు రూ.2 నుంచి రూ.5.20 వరకు ధర మన రాష్ట్రంలో అధికంగా ఉంది.



ఇంతెందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకంటే రూ.2 తక్కువకు పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు అందుతోంది. సరిహద్దు రాష్ట్రమైన అటు తమిళనాడులో మనకంటే రూ.5.20 ధర తక్కువ. మరి మనోళ్లయినా.. పరాయి రాష్ట్రం వాళ్లయినా డీజిల్, పెట్రోలు మన రాష్ట్రంలో ఎందుకు కొట్టించుకుంటారు. వందల కిలో మీటర్ల ప్రయాణంలో వేల రూపాయలు ఆదా చేసుకోవాలని వాహనాల యజమానులు చూసుకుంటారు. ఇదే ప్రస్తుతం జరుగుతోంది. ఈ పరిస్థితే వ్యతిరేకతకు దారితీసింది. ఒక రోజు పెట్రోలు బంకులు మూత పడితే కోట్లలో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. ఒక పక్క ఉల్లి లొల్లి కలవర పెడుతోంది. కిలో ఉల్లి ధర రూ.60 దాటుతోంది. కంది పప్పు, నూనెలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పట్టీ తయారవుతోంది.

 

బంకు ఆపరేటర్లు సహకరించాలి

రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లాలో పెట్రోలు బంకులు 24 గంటలు మూసేయాలని నిర్ణయించాం. అందుకు జిల్లాలోని డీలర్లు అందరూ సహరించాలి. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా చేస్తున్న ఈ ఆందోళన బంకుల డీలర్లతో పాటు ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. వ్యాట్ తగ్గితే ప్రజలకు కూడా ధర వెసులుబాటు కలుగుతుంది.

 వర ప్రసాదరావు, జిల్లా పెట్రోల్ డీలర్స్

 అసోసియేషన్ అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top