దోపిడీకి అడ్డుకట్టేస్తాం

దోపిడీకి అడ్డుకట్టేస్తాం - Sakshi


► సెలెక్ట్‌ ఛానల్‌ పేరుతో ప్రజల డబ్బు లూఠీ చేస్తున్నారు

► వినియోగదారుడు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం

► తూకం, ధరలపై ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ :1967

► రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు




ఒంగోలు టౌన్‌: ‘కిన్లీ వాటర్‌ లీటర్‌ బాటిల్‌ 20 రూపాయలు అమ్ముతున్నారు. దానికి సెలెక్ట్‌ ఛానల్‌ అనే పేరు తగిలించి రూ.50కి అమ్మేస్తున్నారు. పెప్సీ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ రూ.30కి అమ్ముతున్నారు. దానిని కూడా సెలెక్ట్‌ ఛానల్‌ పేరుతో రూ.60కి విక్రయిస్తున్నారు. సెలెక్ట్‌ ఛానల్‌ పేరుతో వాటర్, కూల్‌ డ్రింక్‌ కంపెనీలు ప్రజల డబ్బు లూఠీ చేస్తున్నాయని‘ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇలాంటి దోపిడీలకు అడ్డుకట్ట వేసి వినియోగదారులకు నష్టం జరగకుండా ఉండేందుకు సంబంధిత విభాగాలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.



బుధవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో పౌరసరఫరాలశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో తాను పెట్రోల్‌ బంకులు తనిఖీ చేసినప్పుడు ఒకదానిలో 100 లీటర్లకు 11 నుంచి 12లీటర్ల తేడా కనిపించిందన్నారు. ఒంగోలులో మద్రాసు ఫెర్టిలైజర్స్‌ కంపెనీని తనిఖీచేస్తే ఎరువుల బస్తాకు 4 నుంచి 5 కేజీలు తక్కువ ఉన్నట్లు తేలిందన్నారు. ఇప్పటివరకు ఆరు

కంపెనీలపై కేసులు పెట్టినట్లు వెల్లడించారు.



సమస్యలపై పరిష్కార వేదిక..

గతంలో ఎరువుల కంపెనీలపై రైతులకు నమ్మకం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని మంత్రి చెప్పారు. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువులో తూకం, కొలతలు, ధరల్లో వ్యత్యాసం కనిపిస్తే సంబంధిత కంపెనీలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967 ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని 750మందితో పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో దీనికి సంబంధించిన వ్యక్తులు ఉంటారని, వారు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తమకు నివేదిస్తారన్నారు. రాష్ట్రంలోని 4.5 కోట్ల మందికి రూ.4వేల కోట్ల సబ్సిడీలతో నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు.  



అడ్డదారిలో డబ్బు సంపాదన..

షార్ట్‌ కట్‌లో డబ్బు సంపాదించేందుకు అనేకమంది ట్రేడర్లు అడ్డదారులు తొక్కుతూ వినియోగదారులను దోచుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు. పెట్రోలు బంకుల్లో వినియోగదారులను మోసగించవచ్చని, అదే సమయంలో ఆ బంకు ట్రేడర్‌ కూడా ఎక్కడో ఒకచోట మోసానికి గురవుతున్న విషయాన్ని గమనించాలన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించేందుకు శాఖాపరంగా రెండు అడుగులు ముందుకు వేస్తే, డీలర్లు మూడు అడుగులువేసి వాటిని డైల్యూట్‌ చేస్తున్నారన్నారు.



ఈ–పాస్‌ విధానం చాలా కాంప్లికేటెడ్‌ సిస్టం అయినప్పటికీ, ఎన్‌ఐసీలో పనిచేసిన ఒక రిటైర్డు అధికారిని పట్టుకొని సాఫ్ట్‌వేర్‌ మార్చేశారని, ఒక కార్డుకు సంబంధించి ఏది పెట్టినా ‘ఎస్‌’ అని వచ్చేలా మార్చేశారన్నారు. క్యాష్‌లెస్‌ విధానాన్ని డీలర్లు వ్యతిరేకించడం వెనుక వారి స్వప్రయోజనాలే అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని చౌకధరల దుకాణాల్లో 40 నుంచి 50శాతం అక్కడే బియ్యం రీ సైక్లింగ్‌ జరుగుతుందన్నారు. కొందరు చౌకబియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి రూ.10 నుంచి రూ.15కు అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాల్లో క్యాష్‌లెస్‌ విధానం అమలు చేస్తున్నామని, వినియోగదారుడు పాత పద్ధతిలోనే సరుకులు అడిగితే మాత్రం ఎలాంటి పేచీ పెట్టకుండా అందించాలన్నారు.



అది సెటిల్‌ చేస్తే, ఇది సెటిల్‌ చేస్తా

చంద్రన్న సంక్రాంతి, రంజాన్‌ తోఫా, పాఠశాలలు, అంగన్‌వాడీలకు నిత్యావసర సరుకులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వాలని చౌకధరల దుకాణాదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు ఆ శాఖ కమిషనర్‌ రాజశేఖర్‌ను కోరారు. చౌకధరల దుకాణాలకు క్రెడిట్‌పై అందించిన కందిపప్పు బిల్లులను సెటిల్‌ చేస్తే, ఇది సెటిల్‌ చేస్తానని కమిషనర్‌ సమాధానం ఇవ్వడంతో డీలర్లు అవాక్కయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు, జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్, పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌ మన్నం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.



జూన్‌ నుంచి సబ్సిడీ కిరోసిన్‌ కట్‌

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు జూన్‌ నుంచి సబ్సిడీ కిరోసిన్‌ కట్‌ చేయనున్నట్లు  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్‌ 2వ తేదీ జరగనున్న నవ నిర్మాణ దీక్ష నాటికి రాష్ట్రంలో గ్యాస్‌ పొయ్యి లేని గృహాలు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top