కోతల వాత


 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: అనధికారిక విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. ఒక వైపు విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో పాటు, ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రకటించిన వేళలకంటే గంట నుంచి మూడు గంటల వరకు కోతల సమయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్ కేంద్ర కార్యాలయం తిరుపతి నుంచి జిల్లాల అధికారులకు కోత వేళలు, వాటిని పాటించాల్సిన తీరుపై గతంలో వివరాలు పంపించారు. కానీ ఆ వేళలు పాటించడం లేదు.

 = ఒంగోలు నగరంలో పగలు 3 గంటలు విద్యుత్ కోత విధిస్తారని ప్రకటించారు.



అదికాస్త 4 నుంచి 4.30 గంటల వరకు చేరుకుంది. ఉదయం 9 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తారని ప్రకటించారు. కానీ 11 గంటల వరకు కూడా విద్యుత్ ఇవ్వడం లేదు.



మున్సిపాలిటీల్లో పగలు నాలుగు గంటలు కోత విధిస్తారని గతంలో ప్రకటించినా ఐదు గంటలకుపైగా కోత విధిస్తున్నారు.  ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తారని చెప్పారు. అలాంటిది ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం మరో 45 నిమిషాలు అదనంగా కోత విధిస్తున్నారు.



 గ్రామాల్లో పగటి పూటంతా విద్యుత్ ఉండటం లేదు. గతంలో గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్, పగలు ఇచ్చే సమయాల్లో గ్రామాల్లో విద్యుత్ ఉండేది. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్‌ను 7 గంటల పాటు ఇస్తామని చెబుతున్నా ఆ సమయాలను అధికారులు సక్రమంగా పాటించడం లేదు. దీంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.  



వ్యవసాయ విద్యుత్‌ను అధికారులు మండలాన్ని యూనిట్‌గా చేసుకొని ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి ఇచ్చేవారు. అది కాస్తా జనవరి 15 నుంచి 4 గ్రూపులుగా చేశారు. ఏ, బీ, సీ, డీలుగా విభజించి పగలు, రాత్రి సమయాల్లో విద్యుత్‌ను ఇస్తున్నారు. సమయాలు అయితే ప్రకటిచారు కానీ.. వాటి అమలే ప్రశ్నార్థకంగా మారింది.



 పరిశ్రమల పరిస్థితి అధ్వానం:

 విద్యుత్ కోతలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే చివరకు పరిశ్రమలకూ విద్యుత్ కోతల బెడద తప్పలేదు. వారానికి సరిపడా విద్యుత్‌ను పరిశ్రమలకు ఇవ్వలేమంటూ ఏపీఎస్‌పీడీసీఎల్  చేతులెత్తేసింది. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి పరిశ్రమలకు వారానికి ఒకరోజు పూర్తిగా విద్యుత్ ఇవ్వకుండా నిలిపేస్తున్నారు. అంటే వారానికి ఆరు రోజులు మాత్రమే పరిశ్రమలు పనిచేస్తాయి. అయితే ఈ ఆరు రోజుల్లోనూ రోజుకు 2,3 గంటలు పరిశ్రమల ప్రాంతంలో కూడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పరిశ్రమల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top