పచ్చని బతుకుల్లో పీసీపీఐఆర్ చిచ్చు

పచ్చని బతుకుల్లో పీసీపీఐఆర్ చిచ్చు


‘చంద్రబాబు దొంగదెబ్బ తీశారు’

‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీపీఐఆర్ కోసం అధికారులు వస్తే కట్టికొట్టండని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆయనే మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు మేం ఎవర్ని కట్టి కొట్టాలి?’

- గొర్ల బాబూరావు



సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు పచ్చని పొలాలు, తోటలు మరోవైపు విశాల సాగర తీరంతో అందంగా అలరారుతున్న ఆ పల్లెలపై ‘పీసీపీఐఆర్’ పేరుతో ప్రభుత్వ పడగనీడ పడింది. పెట్రోలియమ్, కెమికల్, అండ్ పెట్రో కెమికల్ ఇన్‌వెస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) కోసం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో 640 చ.కి.మీ. పరిధిలో భారీ భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.



విశాఖపట్నం జిల్లాలో 490చ.కి.మీ. పరిధిలోని  పెదగంట్యాడ, పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని 82 గ్రామాలను ఏకంగా సేకరించాలని నిర్ణయించింది.  ఇందుకోసం ఏకంగా 82గ్రామాల్లో భూసేకరణకు డిసెంబరు 18న నక్కపల్లిలో ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించేసింది.



ప్రభుత్వ దుర్మార్గ వ్యూహం

పొలాల నుంచి రైతులను, సముద్రం నుంచి మత్స్యకారులను దూరం చేసేందుకు ప్రభుత్వం కర్కషమైన వ్యూహం పన్నింది.  అధికారిక లెక్కల ప్రకారం ఆ గ్రామాల్లో 2లక్షలమంది రైతులు, 1,21,511మంది మత్స్యకారులు ఉన్నారు.  కేవలం భూములు మాత్రమే సేకరిస్తామని గ్రామాల్లో ప్రజలు  నివసించవచ్చని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కానీ పొలాలు, తోటలను ప్రభుత్వం గుంజుకున్న తరువాత ఆ గ్రామీణులకు ఆ గ్రామాల్లో ఉపాధి ఉండనే ఉండదు. భూముల చుట్టూ కంచె వేసేస్తే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండదు. మరోవైపు పెట్రోకెమికల్ పరిశ్రమల నుంచి వెలువడే అత్యంత కలుషితమైన వ్యర్థాలతో ఆ గ్రామాల్లో  ఎవ్వరూ ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పొట్టచేతబట్టుకుని ఆ గ్రామాలను వదిలిపోవాల్సిన దుస్థితి అనివార్యమవుతుంది.



నిబంధనలను ఉల్లంఘిస్తూ

పీసీపీఐఆర్ పేరుతో పేదల భూములు బడాబాబులకు కట్టబెట్టాలన్న ఆతృతతో ప్రభుత్వం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అటు న్యాయస్థానాల తీర్పులను కాలరాస్తూ మరోవైపు భూసేకరణ, నోటిఫికేషన్, ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసుకుపోతోంది.



కోర్టు తీర్పును ధిక్కరిస్తూ: 2011లో అప్పటి ప్రభుత్వం నక్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌గా పేర్కొంటూ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో రైతుల పునరావాసంపై స్పష్టత ఇచ్చేవరకు భూసేకరణ ప్రక్రియ చేపట్టవద్దని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఆ ఇండస్ట్రియల్ పార్క్  ప్రతిపాదననే మరింత విస్తృతపరచి ‘పీసీపీఐఆర్’గా మార్చింది. కానీ  కోర్టు తీర్పును  ఏమాత్రం పట్టించుకోకండా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పీసీపీఐఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను ఉపక్రమించింది. పీసీపీఆర్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రతిపాదిత గ్రామాలు చేసిన తీర్మానాలను కూడా పట్టించుకోవడం లేదు.



ప్రజాభిప్రాయ సేకరణ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ

ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ప్రభుత్వం ‘ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్టు (ఈఐఎస్ రిపోర్టు)ను రూపొందించాలి. ఆ భూముల్లో పరిశ్రమల స్థాపన వల్ల ఎలాంటి కాలుష్యానికి దారితీస్తుంది... మనుషులు, జీవజాలం, పంటలు, పర్యావరణం మీద ప్రతికూల ప్రభావం ఎలా ఉండబోతోంది?... అందుకు తీసుకోనున్న నివారణ చర్యలు ఏమిటి అనేవి ఆ నివేదికలో ఉండాలి. కానీ ప్రభుత్వం రూపొందించిన ఈఐఎస్ నివేదిక ఇంతవరకు ప్రజలకు చేరనే లేదు.



పంచాయతీకి ఒకటి చొప్పున నివేదిక కాపీని జిల్లా అధికారులు ఇచ్చినట్లే ఇచ్చి అందకుండా చేస్తున్నారు. చాలావరకు అధికారుల వద్దే తొక్కిపెట్టారు. ఏడుమండలాల్లోని 82 గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి కేవలం ఒక్క నక్కపల్లిలోనే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది.  ఆ 82 గ్రామాల ప్రజలు దూరంగా ఉన్న నక్కపల్లికి రావడం వ్యయప్రయాసలతో కూడుకున్నది. ప్రభుత్వం తాము ముందుకు మేనేజ్ చేసిన తమ మనుషులనే తరలించి తమకు అనుకూలంగా వ్యవహారం నడిపించేందుకే ఇలాంటి ఎత్తుగడ వేసింది.

 

తిరగబడుతున్న పల్లెలు: తమ భూములు గుంజుకోవాలని చూస్తున్న ప్రభుత్వ పన్నాగంపై ప్రజలు భగ్గుమంటున్నారు. రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, కృష్ణపాలెం, నడిపిల్లి, వెదురువాడ, తానాం, బోనంగి, దొప్పెర్ల, చాటిమెట్ట, పూడి, రాంబిల్లి, మర్రిపాలెం... ఇలా ప్రతి గ్రామం రగిలిపోతోంది.

 

‘మమ్మల్ని పెట్రోల్‌పోసి తగలెట్టేసి పెట్రోల్‌ఫ్యాక్టరీలు పెట్టండి’

‘మేం చేపలోళ్లం. గంగమ్మ తల్లినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని సముద్రానికి దూరం చేద్దామని ప్రభుత్వం చూస్తోంది. ముందు మా చేపలోళ్లని పెట్రోల్ పోసి తగలెట్టేసి తరువాత ఫ్యాక్టరీలు పెట్టుకోండి. మేం ప్రాణాలతో ఉండగా భూములు ఇవ్వం. ఊరు వదలం’         

-పైడితల్లి, రాజయ్యపేట

 

‘భూములు ఇవ్వం.. ఊరు వదలం’

‘ఈ గ్రామాల్లో ఎకరా రెండెకరాలు ఉన్న చిన్నకారు రైతులే ఉన్నారు. ఆ కొద్దిపాటి భూమి లాక్కొంటే వారు వలసపోయి కూలీలుగా బతకలేరు. మాబోటి చిన్నరైతులు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. అందుకే భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడతాం’          

- పళ్ల అప్పలస్వామి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top