ఎగవేతకే ఈ ఎత్తులు

ఎగవేతకే ఈ ఎత్తులు


‘మిమ్మల్ని రుణగ్రహణం నుంచి విముక్తుల్ని చేస్తా.. నన్ను గెలిపించండి’- టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో రైతులకు చేసిన అభ్యర్థన అది!  రుణమాఫీ చుట్టూ ఎన్నో పరిమితులు, షరతులు, వీలైనంత మందిని అనర్హులను చేసే ఎత్తులు, జిత్తులు.. అదే బాబు అధికారం దక్కాక రైతులకు చేస్తున్న వంచన ఇది!

 

అమలాపురం టౌన్ / రాయవరం : రుణమాఫీ అమలుకు జారీ చేసిన జీఓ :174 లోపాలమయమని డీసీసీబీ డెరైక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు లేనిపోని నిబంధనలు పెట్టి, రైతులను మభ్యపుచ్చజూస్తోందని ఆరోపించారు. లోపాలను సరిదిద్దడమే కాక జీఓను పూర్తిస్థాయిలో సవరించాలని  డిమాండ్ చేశారు.



అమలాపురంలోని డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో రుణమాఫీ నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించి, జీఓకు చేయాల్సిన సవరణలను ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే ఇందు కోసం మరో ఉద్యమానికి దిగాలని నిర్ణయించారు. కాగా రాయవరం డీసీసీబీ బ్రాంచి వద్ద దాని పరిధిలోని 9 సహకార సంఘాల అధ్యక్షులు రుణమాఫీ జీఓపై నిరసన వ్యక్తం చేశారు. బ్రాంచిలో కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారు.

 

డీసీసీబీ డెరైక్టర్ గోదాశి నాగేశ్వరరావు అధ్యక్షతన అమలాపురంలో జరిగిన సమావేశంలో మరో ఆరుగురు డీసీసీబీ డెరైక్టర్లు అడబాల నాగేశ్వరరావు, జవ్వాది బుజ్జి, బొంతు జవహర్, చెలువూరి రామకృష్ణరాజు, పాముల విజయరంగారావు, విళ్ల గోపాలకృష్ణ, దంగేటి దొరబాబు, కోనసీమలోని 116 సహకార సంఘాల అధ్యక్షులు, బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెడబొట్టు రాంబాబు, కార్యదర్శి ముత్యాల జమి, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందరావు, భారతీయ ఆగ్రో ఎకనమిక్ రీసెర్చ్ డెరైక్టర్ తిక్కిరెడ్డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. షరతులు లేని రుణమాఫీని అమలు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

 

బీమా సొమ్మును ప్రభుత్వం జమ చేసుకోవడం సరికాదని, రైతులకే అందజేయాలని, 2014 డిసెంబరు 31లోపు తీసుకున్న రుణాలకే మాఫీ అన్న నిబంధనను రద్దు చేసి 2014 మార్చి 31లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని, ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటర్‌కార్డులు తదితర నిబంధనలను ఎత్తి వేయాలని, 2014 జనవరి 1 నుంచి మార్చి 31 లోపు రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు కూడా మాఫీ వర్తించేలా జీఓను సవరించాలని కోరారు.

 

27 నుంచి నిరసనలు..

జీఓ :174ను సవరించాలన్న డిమాండ్‌తో బీకేఎస్ ఈనెల 27న అమలాపురంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయనుంది. డీసీసీబీ డెరైక్టర్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, సమితి నాయకులు, రైతుల సహకారంతో డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాల ముట్టడి, ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. తహశీల్దారు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే డీసీసీబీ బ్రాంచ్‌ల వారీ సహకార సంఘాల అధ్యక్షులు రిలే దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను, కోనసీమలోని ఎమ్మెల్యేలను రైతు ప్రతినిధులు కలిసి జీఓ సవరణ ఆవశ్యకతను వివరించాలని నిర్ణయించారు.

 

టీడీపీ నేతతో రైతుల వాగ్వాదం


సమావేశం ప్రశాంత వాతావరణంలో సాగినా ఒకదశలో భిన్నాభిప్రాయాలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బీకేఎస్ నాయకులు జీఓ:174 ను పూర్తిగా రద్దు చేయాలనగా, సహకార సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులు జీఓను సవరించాలనడంతో ఓ దశలో  కాస్త గందరగోళం నెలకొంది. టీడీపీ నేత, కోనసీమ రౌతు పరిరక్షణ సమితి నాయకుడు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడబోగా రైతులు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయరామారావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ముఖ్య నాయకులు రంబాల బోసు, జగతా జానకీరామయ్య, వాసంశెట్టి సత్యం, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బోనం నాగేశ్వరరావు, గణేశుల రాంబాబు, అడబాల పెదమూలస్వామినాయుడు తదితరులు ప్రసంగించారు.

 

సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది..

షరతులు లేని రుణమాఫీని అమలు చేయాలని రాయవరం డీసీసీబీ బ్రాంచి పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. శుక్రవారం తొమ్మిది సొసైటీల అధ్యక్షులు బ్రాంచి వద్ద నిరసనకు దిగి, కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. సిబ్బందిని బయటకు తీసుకు వచ్చి బ్రాంచికి తాళాలు వేయించారు. జీఓ:174కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సహకార సంఘాల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు వట్టికూటి సోమశేఖరరావు, వైట్ల రాంబాబు మాట్లాడుతూ జీఓ :174 లోపభూయిష్టమన్నారు.

 

అది అమలైతే రాయవరం డీసీసీబీ బ్రాంచి పరిధిలో సుమారు నాలుగు వేల మంది రైతులకు రూ.12 కోట్ల మేర రుణం మాఫీ కాదన్నారు. జీఓలో మార్పులు చేసే వరకూ సొసైటీ కార్యకలాపాలను నిలుపుదల చేస్తున్నామని, ప్రభుత్వం అడిగే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వబోమని అన్నారు. సక్రమంగా రుణం చెల్లించిన వారికి కాక చెల్లించని వారికే ప్రయోజనం చేకూర్చేలా ఉన్న జీఓ సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. సోమేశ్వరం, వెదురుపాక, మాచవరం, పులుగుర్త, కుతుకులూరు, కొమరిపాలెం, ఊలపల్లి, కొంకుదురు, పందలపాక సొసైటీల అధ్యక్షులు వైట్ల రాంబాబు, సత్తి వీర్రాఘవరెడ్డి(వీరవెంకట), సత్తి ఈశ్వరరెడ్డి, వట్టికూటి సోమశేఖరరావు, పులగం తిరుమలతిరుపతి వెంకటేశ్వరరెడ్డి, తాడి అరవిందం, గండ్రాల విజయచంద్రశేఖరరెడ్డి, కర్రి సూరారెడ్డి, పడాల సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top