నమ్మించి మోసం చేసిన చంద్రబాబు

నమ్మించి మోసం చేసిన చంద్రబాబు - Sakshi


శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు తమను నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేశారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రెండో రోజైన శుక్రవారం కూడా ‘నరకాసుర వధ’ పేరిట నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రైతులు స్వచ్ఛందం గా పాల్గొన్నారు. రుణమాఫీపై సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుని దుయ్యబట్టారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరనస తెలిపారు.

 

మూడేళ్లుగా పంటలను నష్టపోతుంటే తమ రుణాలను మాఫీ చేస్తారని నమ్మి ఓటు వేశామని.. ఇప్పుడు రోజుకో మాట చెబుతూ మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్, ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెంలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని పోలాకి మండలం మబుగాం గ్రామంలో కృష్ణదాస్ కుమారుడు ధర్మాన రామలింగంనాయుడు ఆధ్వర్యంలోనూ, టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో పేడాడ తిలక్ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు.

 

బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలో పార్టీ సమన్వయకర్త నర్తు రామారావు, మాజీ ఎంపీపీ తిలక్‌ల నేతృత్వంలోనూ, రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్టలో ఎమ్మెల్యే కంబాల జోగులు నేతృత్వంలో, పాతపట్నం నియోజకవర్గం కల్లట గ్రామంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో, ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో మాజీమంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.

 

అన్నిచోట్లా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని తెలుగుదేశం నాయకలు అవలంబిస్తున్న తీరును నిశితంగా విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ జరగక పోగా కొత్త రుణాలను సైతం ఇవ్వక పోవడంతో అధిక వడ్డీకి అప్పులు తేవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీతో పాటు రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top