అ..అంటే అతిసార ఆ.. అంటే ఆస్పత్రి

అ..అంటే అతిసార ఆ.. అంటే ఆస్పత్రి - Sakshi


► 4 నెలల్లో 19,094 కేసులు నమోదు

► రోజురోజుకూ పెరుగుతున్నబాధితుల సంఖ్య

► నగరాలు, పట్టణాల్లోనే రోగులు ఎక్కువ

► నీరు కలుషితం కావడం వల్లే ఈ దుస్థితి




‘అ.. అంటే అమరావతి. ఆ.. అంటే ఆరోగ్యం...’  అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ వాస్తవంగా ‘అ.. అంటే అనారోగ్యం,  ఆ.. అంటే ఆస్పత్రి...’  అన్నట్లుగా ఉంది రాజధాని జిల్లాల్లో వాస్తవ పరిస్థితి. ఒకవైపు కాలుష్యం పెరగడం వల్ల గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతోంది. ప్రమాదకర స్థాయిలో విషవాయువులను పీల్చుకుని ప్రజలు గుండె, ఊపిరితిత్తులు, మెదడు, నరాల సంబంధ వ్యాధుల బారినపడుతున్నారు. మరోవైపు ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా అతిసార వ్యాధి విజృంభిస్తోంది. రెండు జిల్లాల్లోనూ నాలుగు నెలల్లో 19,094 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు మున్సిపాలిటీలు, గ్రామాల్లో కలుషిత నీరు తాగడం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వాంతులు, విరేచనాల కారణంగా  నీరసించి కదల్లేక, మెదల్లేక మంచాలకే పరిమితమవుతున్నారు.



సాక్షి, అమరావతి: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డయేరియా చాపకింద నీరులా ప్రబలుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ వ్యాధి బారినపడుతున్నారు. గడచిన నాలుగు నెలలుగా గుంటూరు జిల్లాలో 11,345, కృష్ణా జిల్లాలో 7,749 డయేరియా కేసులు నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ గణాంకాలు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారి వివరాలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో మరో 30వేల మందికి పైగా చికిత్స పొందుతుంటారని అంచనా. మండుతున్న ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ, డయేరియా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.



కలుషిత నీటి వల్లే...

రాజధాని ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో గత ఏడాది కంటే ఈ సంవత్సరం భూగర్భ జలాలు 3.5 అడుగుల మేర తగ్గినట్లు అంచనా. రక్షిత మంచినీరు కూడా అందుబాటులో లేదు. పెరుగుతున్న ఎండల వల్ల నీటి కొరత తీవ్రమవుతోంది. కొన్నిచోట్ల చిన్నచిన్న దిగుడు బావులు, చెలమలు, కుంటల్లో నీరు ఇంకిపోయి కలుషితమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా కూడా అందుబాటులో ఉన్న కలుషిత నీటినే సరఫరా చేస్తున్నారు. పశ్చిమ కృష్ణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.



గుంటూరు జిల్లాలో 125 తాగు నీటి చెరువులు ఉండగా, వాటిలో 78 పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. మిగిలిన చెరువుల్లో అరకొర నీరు ఉన్నప్పటికీ కలుషితమై తాగేందుకు పనికిరాకుండా పోయింది. అదే సమయంలో రెండు జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులకు జనం గొంతు తడారిపతోంది. ఒంట్లో తేమ శాతం తగ్గిపోతుంది. దీంతో నీరు తాగి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో నీరసించి మంచాలకే పరిమితమవుతున్నారు. విజయవాడలో అయితే భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితమయ్యాయి. కృష్ణా నుంచి నీటిని సరఫరా చేసే మూడు కాలువల్లో వ్యర్థపదార్థాలు, మురుగునీరు కలిపేయడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top