మా సమాధులపై రాజధాని కడతారా?


* రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల ఆగ్రహం

* చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారంటూ మండిపాటు

* రైతుల అభిప్రాయాలు సేకరించిన విజయవాడ, గుంటూరు

* బార్ అసోసియేషన్ల సభ్యులు



తాడేపల్లి: మా సమాధులపై రాజధాని కడతారా అంటూ రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పైన మండిపడ్డారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు రైతులతో సమావేశం నిర్వహించారు. రాజధానికి భూములిచ్చే విషయంలో రైతుల అభిప్రాయూలను వారు సేకరించారు.



తుళ్లూరు, మంగళగిరి మండలాల రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వంపైన, సీఎంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా భూములు లాక్కొని మా పొట్టలు కొడతారా? మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్లపైకి నెడతారా? మా సమాధులపై అందమైన రాజధాని కడతావా బాబూ...!’ అంటూ మండిపడ్డారు. ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో, చానళ్లలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అదంతా చంద్రబాబు మైండ్‌గేమ్‌లో భాగమేనని వ్యాఖ్యానించారు.



రైతులు చెప్పిన విషయాలను విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సదరం శ్రీనివాసరావు, కార్యదర్శి రవికుమార్, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యుడు మల్లెల శేషగిరిరావు నమోదు చేసుకున్నారు. రైతుల అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు సి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ సొసైటీ అధ్యక్షుడు మేకా శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



బార్ అసోసియేషన్లకు రైతులు ఇచ్చిన డిమాండ్లు ఇవీ..

*   భూసేకరణపై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి.

* ఎకరా భూమికి ఎంత చెల్లిస్తారో కచ్చితంగా చెప్పాలి. ప్రతి ఎకరాకు అభివృద్ధి చేసిన భూమిలో 1,500 గజాల స్థలం ఇవ్వాలి. అదీ ప్రస్తుతం భూమి తీసుకుంటున్న ప్రాంతంలోనే ఇవ్వాలి.

* రోడ్లు, కరకట్టలకు ఆనుకుని భూములున్న రైతులకు భూసేకరణ అనంతరం అభివృద్ధి చేసి ఇచ్చే భూమిని కూడా రోడ్డు పక్కదే ఇవ్వాలి. అదీ ఎంతకాలంలో ఇస్తారో చెప్పాలి.

* ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో సారవంతమైన 3 పంటలు పండే భూముల్లో కౌలు రూ. 50 వేల వరకు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిహారం కూడా ప్రభుత్వం చెప్పే కాలపరిమితి మెుత్తాన్ని లెక్కించి ఒకేసారి ఇవ్వాలి.

* ఇవన్నీ హామీలుగా కాక శాసనసభలో చట్టం చేసిన తరువాతే భూసేకరణకు చర్యలు ప్రారంభించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top