తిరగబడ్డ పెనుమాక రైతులు

తిరగబడ్డ పెనుమాక రైతులు - Sakshi


పేద రైతుల భూములే కావాల్సి వచ్చాయా? అంటూ నిలదీత

 

 మంగళగిరి: రాజధాని ప్రాంతంలో భూసేకరణ వైపు అడుగులు వేస్తున్న సీఆర్‌డీఏకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని నగర భూసేకరణ, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. జిల్లా సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, పెనుమాక సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. గ్రామసభ విషయమై గ్రామస్తులెవరికీ సమాచారం ఇవ్వలేదు. ఉదయం 11 గంటల సమయంలో సభ జరుగుతున్న విషయం తెలుసుకున్న గ్రామ రైతులు సుమారు 70 మంది అక్కడికి చేరుకుని సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు.



తమ భూములిమ్మంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు రాజధానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. వారి భూములు, ఆస్తులు దాచి పెట్టుకుంటారు.. మా భూములు మాత్రం త్యాగంచేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేద రైతుల భూములు లాక్కొని విదేశీ సంస్థలకు కట్టబెట్టి అందినకాడికి దోచుకోవడమేనా సీఎం, మంత్రుల త్యాగం అంటూ ధ్వజమెత్తారు. దీంతో కంగుతిన్న సీఆర్‌డీఏ అధికారులు తాము సామాజిక ప్రభావం అంచనాకోసం సర్వే నిర్వహించే ఈపీటీఆర్ సంస్థను పరిచయం చేసి వారికి సహకరించాలని మాత్రమే కోరడానికి వచ్చామని, ఆ ప్రతినిధులు మీ ఇళ్లకు వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. గ్రామసభ జరిగినట్లు రైతులు సంతకాలు చేయాలని కోరగా తాము సంతకాలు చేయబోమంటూ రైతులు మూకుమ్మడిగా సమాధానం ఇవ్వడంతో చేసేదేమిలేక అధికారులు, ఈపీటీఆర్ ప్రతినిధులు గ్రామసభను వాయిదా వేసి వె నుదిరిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top