పింఛన్లకు పీటముడి

పింఛన్లకు పీటముడి

  •  నగరంలో 23,201 మందికి అందని వైనం

  •   కాళ్లరిగేలా తిరుగుతున్న పేదలు        

  •   తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు

  •   జన్మభూమి జరిగితేనే లబ్ధి

  • 8 వెంకటేశ్వరమ్మది 48వ డివిజన్. వృద్ధాప్య పింఛన్ వస్తే కానీ మందులు కొనుక్కోలేని పరిస్థితి. పింఛన్ రావాలంటే జన్మభూమి జరగాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి పదిసార్లు పింఛన్ కేంద్రాలకు వెళ్లి వచ్చింది. పింఛన్ ఇప్పించడమ్మా అని డివిజన్ కార్పొరేటర్‌ను పదేపదే అడుగుతోంది.

     

    8 రంగారావుకు డెబ్భై ఏళ్లు. రూ.200 పింఛన్ రూ.1000కి పెంచారని సంబరపడ్డాడు. 59వ డివిజన్లో జన్మభూమి జరగకపోవడంతో పింఛన్ చేతికి అందలేదు. 25వ తేదీ నుంచి మొదలవుతోందనుకున్న జన్మభూమి కార్యక్రమం నవంబర్ ఒకటికి వాయిదా పడడంతో నీరుగారిపోయాడు.

     

    విజయవాడ సెంట్రల్ : కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా పింఛన్ల వ్యవహారం తయారైంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ సొమ్ము పెంచామని  ప్రచారం చేసుకున్న టీడీపీ సర్కార్ సకాలంలో పింఛన్లను అందించడంలో చతికిలపడింది. పింఛన్ సొమ్ము కోసం పేదలు ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. జన్మభూమి జరిగినప్పుడే పింఛన్ ఇస్తారన్న సమాధానం ఎదురవడంతో లబ్ధిదారులు ఉసూరుమంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల రెండో తేదీన నగరంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

     

    ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధాప్య, వితంతు, చేనేత పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1,000కి, వికలాంగ పింఛన్లను రూ. 500 నుంచి రూ. 1,500కి పెంచినట్లు ప్రకటించారు. బసవపున్నయ్య స్టేడియంలో కొద్దిమంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో వారంతా తమ దశ తిరిగినట్లేనని భావించారు.

     

    వాయిదాల పర్వం..



    జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఈ నెల నాలుగో తేదీ నుంచి నగరంలో ప్రారంభించారు. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 21 డివిజన్లలో గ్రామసభలు నిర్వహించారు. ఆయా డివిజన్లలోని 9,373 మందికి గాను 7,566 మందికి పింఛన్లు అందించారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) రికార్డుల ప్రకారం 59 డివిజన్లలో 30,767 మంది లబ్ధిదారులు ఉన్నారు.



    వీరిలో 7,566 మందిని మినహాయిస్తే  23,201 మందికి పింఛన్లు అందాల్సిఉంది. హుదూద్ తుపాను నేపథ్యంలో ఈ నెల 13న జన్మభూమిని వాయిదా వేశారు. 17 నుంచి ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ అమలు కాలేదు. 25 నుంచి 31 వరకు గ్రామసభలకు షెడ్యూల్ రూపొందించారు. చివరి నిమిషంలో సర్కార్ మళ్లీ నవంబర్ ఒకటో తేదీకి జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు జరిగితే  అక్టోబర్ పింఛన్ నవంబర్ 11లోపు లబ్ధిదారులకు అందే అవకాశం ఉంది. మరి నవంబర్ నెల పింఛన్ ఎప్పుడిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

     

    కార్పొరేటర్లపై ఒత్తిడి



    పింఛన్ కోసం కార్పొరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. 38 డివిజన్లలో గ్రామసభలు జరగాల్సి ఉంది. ఆయా డివిజన్ల లబ్ధిదారులు కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి బాధల్ని ఏకరువు పెడుతున్నారు. అధికారులతో మాట్లాడి పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని, మందుల ఖర్చుకు పైసలు వెతుకులాడాల్సివస్తోందని బాధల చిట్టా విప్పుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల యూసీడీ అధికారులతో సమావేశమైన మేయర్ కోనేరు శ్రీధర్ పింఛన్లు ఇచ్చేయొచ్చు కదా అని అడిగారు. జన్మభూమి సభల్లోనే పింఛన్లు ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో..అలా అయితే ఓకే అన్నారు.

     

    జన్మభూమితో మెలిక



    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేది. ఆయన మరణానంతరం 15 తేదీ లోపు ఇచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జన్మభూమి ఎప్పుడు జరిగితే అప్పుడు పింఛన్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004కు ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా ఇదే విధానం కొనసాగడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పాతకథే పునరావృతం అవుతోంది.

     

    స్పందించని డీఆర్‌డీఏ



    లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా జన్మభూమితో సంబంధం లేకుండా పింఛన్ల పంపిణీకి అనుమతి ఇవ్వాల్సిందిగా యూసీడీ పీవో ఎం.శకుంతల డీఆర్‌డీఏ పీడీకి లేఖ రాశారు. డీఆర్‌డీఏ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె మిన్నకుండిపోయారు. జన్మభూమి అక్టోబర్ పింఛన్లకు గండికొట్టిందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top