పెళ్లిపేరుతో మోసం చేసిన ఖాకీ


తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ ఎస్‌ఐ యువతిని ఆస్పత్రి పాలుచేసిన ఉదంతమిది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సోదరుడు, కుటుంబ సభ్యులు శనివారం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  వారి కథనం మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం చాదనకోటకు చెందిన ఏ.జయస్వామి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.



గతంలో చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎస్‌ఐగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల క్రితం తిరుపతికి బదిలీఅయ్యారు. ఇతని సొంతగ్రామానికి చెందిన మద్దెల సరోజ(22)ను ప్రేమించాడు. యువతి తండ్రి తన కుమార్తెను పెళ్లిచేసుకోవాలని జయస్వాములు అన్న బాలస్వామిని అడిగాడు. అందుకు ఆయన కట్నం డిమాండ్ చేయడంతో మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత 2013 ఆగస్టు 25న ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కేశవయ్యకు ఇచ్చి వివాహం చేశాడు. అత్తగారింటికి వెళ్లిన సరోజకు జయస్వాములు తరచూ ఫోన్ చేసేవాడు. విషయం సరోజ అత్తకు తెలిసింది.



పంచాయితీ పెట్టి సరోజకు విడాకులు ఇప్పించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తాను విధులు నిర్వర్తిస్తున్న ములకలచెరువుకు తీసుకెళ్లి మూడు నెలలు కాపురం చేశాడు. తరువాత ఆమె బంధువుల ఇంటివద్ద వదలి వెళ్లిపోయాడు. మళ్లీ ఫోన్ చేయడంతో సరోజ మనస్తాపానికి గురై ఆత్మహత్యకుయత్నించింది. ప్రస్తుతం బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోం ది.

 

ఆనంతపురం రేంజ్ డీఐజీకి ఫిర్యాదు

 

సరోజ కుటుంబసభ్యులు అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణకు ఎస్‌ఐ జయస్వాములుపై ఫిర్యాదు చేశారు. ఆపై ములకలచెరువు సీఐ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.

 

తిరుపతికి వచ్చిన బ్రాహ్మణకొట్కూరు పోలీసులు

 

ఎస్‌ఐ జయస్వాములును అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు శనివారం కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప, కానిస్టేబుల్ తిరుపతికి వచ్చారు. అప్పటికే స్టేషన్‌లో ఎస్‌ఐ జయస్వాములు వెస్ట్ సీఐ నరసింహారావుతో కలిసి మాట్లాడుతున్నారు. బ్రాహ్మణకొట్కూరు నుంచి వచ్చిన ఎస్‌ఐతో వెస్ట్ సీఐ ఆవేశంగా మాట్లాడారు. అంతలో అక్కడికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ను బయటకు వెళ్లమని పురమాయించారు.

 

నా చెల్లి రోడ్డున పడింది

 

‘పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడు నెలలపాటు సహజీవనంచేశాడు. తీరా కర్నూలులో బంధువుల ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన నా చెల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నా చెల్లెకు న్యాయం చేయండి సారూ’ అంటూ బాధితురాలి సోదరుడు గౌరీ ఈశ్వరయ్య కన్నీటిపర్యంతమయ్యాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top