రుణం భూతమై..మరణమే శరణమై..

రుణం భూతమై..మరణమే శరణమై.. - Sakshi


గొల్లప్రోలు :తన బడుగు కుటుంబం ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేయాలని ఆశించాడా రైతు. కొడిగట్టిన బతుకులో కాస్త వెలుగు నింపగలది ‘తెల్ల బంగారమే’ (పత్తి)నని నమ్మాడు. తన ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి అప్పు చేసి తెచ్చిన సొమ్మును, చెమటను రంగరించి రెండెకరాల్లో సాగు చేశాడు. తీరా పత్తి కాపుదశకు వచ్చేసరికి ప్రకృతి పగబట్టింది. హుదూద్ తుపాను రూపంలో విరుచుకుపడి, పంట నేలనంటేలా చేసింది. కలలను గాలి కబళించి, చేసిన అప్పు భూతంలా భయపెట్టగా.. దిక్కుతోచని ఆ రైతు మరణ మే శరణ్యమనుకున్నాడు. మండలంలోని చేబ్రోలుకు చెందిన కౌలురైతు పెద్దింటి వీరరాఘవ (40) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 ఈ విషాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కూలీ నాలీ చేసుకునే వీరరాఘవ గ్రామానికి చెందిన  దిబ్బిడి అప్పన్నదొరకు చెందిన రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. చేతిలో డబ్బులు లేకపోయినా రూ.50 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. కాపు దశలో ఉన్న పంట మొత్తం హుదూద్ తుపానుతో నేలనంటింది. కుక్కలు చింపిన విస్తరిలా మిగిలిన చేనును చూసి వీరరాఘవ గుండె చెదిరింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ధైర్యం దిగజారింది. చీడపీడల నివారణకు వాడే పురుగుమందే తన దుర్దశకు విరుగుడని నిశ్చయించుకున్నాడు. బుధవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూ పురుగుమందు తాగాడు. ఇంటికి చేరగానే కుప్పకూలిన ఆయన తాను పురుగు మందు తాగానని భార్యకు తెలిపాడు. ఆయనను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వీరరాఘవ కుటుంబం చిన్న పూరింట్లో ఉంటోంది.  

 

 ఆమెకు నిరుడు కడుపుకోత.. ఇప్పుడు గుండెకోత

 తుపానుకు పంట దెబ్బ తిన్న తరువాత భర్త తరచూ అప్పుల గురించే ప్రస్తావించేవాడని వీరరాఘవ భార్య సత్యవతి గొల్లుమంది. ఎదిగొచ్చిన వారి ఒక్కగానొక్క కొడుకూ ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు భర్తనూ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిన సత్యవతి ‘నాకు దిక్కెవర’ంటూ విలపిస్తుంటే చూసినవారి హృదయాలు ద్రవించాయి. వీరరాఘవ ఆత్మహత్యతో గ్రామంలో విషాదం అలముకుంది. ఏఎస్సై కృష్ణబాబు చేబ్రోలు వచ్చి వీరరాఘవ బంధువులు, స్థానికులతో మాట్లాడారు. వీరరాఘవ సాగు చేసిన పొలం, అప్పుల వివరాలను తెలుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top