అవినీతిమయం

అవినీతిమయం - Sakshi


► బాబు వంచనను ప్రజలకు వివరించాలి

► వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గెలిపించి తీరాలి

► వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలో పెద్దిరెడ్డి, భూమన

► అట్టహాసంగా ముగిసిన ప్లీనరీ...

► 34 తీర్మానాలకు ఆమోదం




తిరుపతి మంగళం/ తిరుపతి అర్బన్‌ : రాష్ట్రాన్ని అవినీతికి నిలయంగా మార్చిన సీఎం చంద్రబాబుకు దండుకోవడం, దాచుకోవడం మాత్రమే తెల్సునని వైఎస్సార్‌సీపీ శాసనసభా ఉప పక్షనేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తిరుపతిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన జిల్లా ప్లీనరీలో పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లను గెలిపించి ప్రతిపక్షనేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా అందించాల్సి ఉందన్నారు.



ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేయాలన్నారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ట్రానికి సరైన నాయకుడు లేక చిన్నపాటి అభివృద్ధికి నోచుకోక గందరగోళంగా తయారైంది. అప్పటి కాంగ్రెస్‌ పాలనలో మూడేళ్లు, ఇప్పుడు చంద్రబాబు పాలనలో మరో మూడేళ్లు పాటు రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అధికార దాహంతో ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా నోటికి వచ్చిన అబద్దపు హామీలతో అధికారం చేజించుకున్నాడు.



అధికా రంలోకి వచ్చాక  ప్రజల సంక్షేమాన్ని గాలికి వది లేసి అవినీతి అక్రమాలతో రూ.లక్షల కోట్లు దండుకోవడమే లక్ష్యంగా మందుకు పోతున్నాడని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సూచిం చారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. అవినీతి ప్రభుత్వ పాలనకు సమాధి కట్టేందుకు కార్యకర్తలు కంకణబద్దులై కదలాలని పిలుపుని చ్చారు.



గుక్కెడు తాగునీటిని అందించడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమై మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. గామీణ ప్రాంతాల్లో చిన్నపాటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. దళితకాలనీలు, గిరి జన తాండాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. వైఎస్సార్, జగన్‌ ఫొటోలతో గెలుపొంది డబ్బులకు, మంత్రి పదవులకు కక్కుర్తి పడి టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను దూషిం చడం, విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.



పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్‌ విసిరారు. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి, డాక్టర్‌ సునీల్‌కుమార్, అనుబంధ సంఘాల నాయకులు ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస, అరాచకపాలన అంతం కావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా నాయకత్వం కావాలని జిల్లా స్థాయి పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. జిల్లానలుమూలల నుంచి ప్లీనరీకి కార్యకర్తలు ఉత్సాహంగా తరలి వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top