అధికార దుర్వినియోగంతోనే గెలుపు


► గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లే పీడీఎఫ్‌ సాధించింది

► ఇది ప్రజాసంఘాల నైతిక విజయం

► ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ

సీతమ్మధార (విశాఖ ఉత్తర) : బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగంతోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగాయని ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ అన్నారు. ఓటర్ల నమోదుతో మొదలైన ఆ పర్వం ఎన్నికల నిబంధనలను బేఖాతర్‌ చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వరకు కొనసాగిందన్నారు. ఎంఎంటీసీ కాలనీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, పీడీఎఫ్‌ అభ్యర్థి అజశర్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఓటర్లను ఒత్తిడికి, ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.

ఆ తీర్పే నిదర్శనం

రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఐదింటిలో బీజేపీ, టీడీపీ నాలుగు స్థానాల్లో ఓటమి పాలయ్యాయన్నారు. రాష్ట్రప్రభుత్వ పనితీరుకు ఈ తీర్పే నిదర్శనమని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని పీడీఎఫ్‌ అభ్యర్థి అజశర్మ తన ప్రచారంలో ముందుకు తెచ్చారన్నారు. దీనికి విరుద్ధంగా బీజేపీ అభ్యర్థి తరఫు ప్రచారం చేసినవారు మేం అధికారంలో ఉన్నాం, కాబట్టి మేమే గెలవాలన్న ధోరణితో వ్యవహరించారన్నారు.


ఉత్తరాంధ్ర సమస్యలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు సమాధానం చెప్పకపోవడం అన్యాయమన్నారు. అజశర్మకు గత రెండు ఎన్నికల కన్నా అధికశాతం ఓట్లు రావడంతో నైతికంగా ప్రజాసంఘాల విజయంగా పేర్కొన్నారు. ఓటర్ల తీర్పును గౌరవించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ కృషిని కొనసాగిస్తామన్నారు.

పెద్దల సభ ఎన్నికలు హుందాగా జరగాలి: అజశర్మ

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, శాసనమండలి పి.డి.ఎఫ్‌.అభ్యర్థి అజశర్మ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఓట్లు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ అధికార దుర్వినియోగంతో, డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. హుందాగా ఉండవలసిన పెద్దల సభకు ప్రతినిధిగా ఎన్నిక కావడానికి కుల సంఘాల మీటింగ్‌లు ఏర్పరచడం, అధికార పదవులలో ఉన్న కుల కార్పొరేషన్ల నేతలను ప్రతక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దింపడం దిగజారుడు పద్ధతులకు పాల్పడ్డారని అన్నారు.


అయితే ఈ ఎన్నికల్లో తమ బలం 38 వేలకు పెరిగిందన్నారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి కొనసాగిస్తామన్నారు. ఈ ఎన్నికలలో తమకు మద్ధతు ఇచ్చిన వైఎస్సార్‌ సీపీ, జనసేన పార్టీలకు కృతజ్ణతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో  11 వేల ఓట్లు చెల్లని వైనంపై ప్రశ్నించగా, గత ఎన్నికల్లో 6 వేల ఓట్లు చెల్లలేదన్నారు. కాగా 80 శాతం మంది ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను వినియోగించలేదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top