రాజధాని భూముల పరిహారం చెల్లింపులో మెలిక

రాజధాని భూముల పరిహారం చెల్లింపులో మెలిక


ఎంజాయ్‌మెంటు, భూముల నిర్ధారణకు కొనసాగుతున్న సర్వే

సర్వే పూర్తయ్యాక పరిహారం చెల్లిస్తామంటున్న సర్కారు

జరీబు భూములపై పీటముడి వేస్తున్న అధికారగణం

అధికశాతం భూములను మెట్టగానే చూపాలని మౌఖిక ఆదేశాలు!


 

హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 21లోగా వచ్చే ఏడాది కౌలు చెల్లిస్తామని బీరాలు పలికిన సర్కారు ఇప్పుడు భూముల నిర్ధారణలో మెలిక పెడుతోంది. ఇటీవలే కౌలు పరిహారానికిగాను సీఆర్‌డీఏకు రూ.143 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ మేరకు రైతులకు డీడీలు ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తోంది. అదేమంటే భూమి ఎవరి స్వాధీనంలో ఉన్నదీ నిర్ధారించేందుకు ఉద్దేశించిన ఎంజాయ్‌మెంటు సర్వే కొనసాగుతున్నదని, ఈ నెలాఖరుకు దీన్ని పూర్తి చేసి పరిహారం చెల్లిస్తామని చెబుతోంది. ఇప్పటికే రైతులందించిన పత్రాల్ని 1908 భూ రికార్డులతో సీఆర్‌డీఏ సిబ్బంది పోల్చిచూశారు. అవన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఏ రైతుకు ఎంత భూమి ఉంది? ఎవరి అనుభవంలో ఉందనే విషయాన్ని తేల్చేందుకు ఓ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో సర్వేయర్లతో ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రారంభించారు. మొత్తం 29 గ్రామాల్లోనూ 26 యూనిట్లలో ఈ సర్వే కొనసాగుతోంది. ఒక్కో యూనిట్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వం వహిస్తున్నారు.



అధిక శాతం మెట్టభూములుగానే పరిగణన!



రాజధాని నిర్మాణానికి జనవరి 2 నుంచి భూసమీకరణ ప్రారంభించారు. మొత్తం 29 గ్రామాల్లో 47,870 ఎకరాల భూమి ఉంది. దీన్లో అసైన్‌మెంట్, వక్ఫ్‌బోర్డు, దేవాదాయ, ప్రభుత్వ భూములుపోనూ ప్రైవేటు పట్టాభూములు మొత్తం 33,252 ఎకరాలను సేకరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో వెయ్యి ఎకరాలకుపైగా నదీగర్భంలో కలసినందున వీటిని సర్వే చేస్తున్నారు. రైతులనుంచి సేకరించిన భూముల్లో పదేళ్లపాటు ఎకరాకు మెట్టకు రూ.33 వేలు, జరీబు భూమికి రూ.55 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ భూముల్లో ఎన్ని ఎకరాలు మెట్ట భూములున్నాయో.. ఎన్ని ఎకరాలు జరీబు భూములున్నాయో.. ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించకుండా ఆ రికార్డుల్ని తహసీల్దారు యూనిట్లకు కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు అందజేసింది. వీరి ఆధ్వర్యంలో.. సమీకరించిన భూముల్ని ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు పరిశీలించి జరీబు భూములా? మెట్టభూములా? అన్నది తేలుస్తారు. తహసీల్దారు  రికార్డుల్లో మెట్టభూములుగా నమోదై, క్షేత్రస్థాయిలో జరీబు భూములైతే వాటిని జరీబు భూములుగా మార్చేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అధికారముంది.



ఇదిలా ఉండగా రైతులనుంచి సమీకరించిన భూముల్ని అధికశాతం మెట్టభూములుగానే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకందిన ఆదేశాల మేరకు ముందుకెళుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తామిచ్చిన అంగీకారపత్రాల్ని వెనక్కు తీసుకునేందుకు వారు ఆందోళన బాట పడుతున్నారు. కాగా తహసీల్దారు అందించిన రికార్డుల్లో జరీబు అని ఉన్నా క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత మెట్టభూములుగానే డిక్లేర్ చేయాలని అంతర్గత ఆదేశాలున్నట్లు సమాచారం. మంగళగిరి ప్రాంతంలోని గ్రామాల్లో మొత్తం జరీబు భూములైనా అధికారులు కొన్నింటిని మెట్టభూములుగానే గుర్తిస్తున్నారని రైతులు చెబుతున్నారు.

 

నేడు సర్వే బృందాలతో సీఆర్‌డీఏ కమిషనర్ భేటీ




గుంటూరుకు సమీపంలోని పలకలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ సర్వే బృందాలతో ఆదివారం సమావేశం కానున్నారు. రైతులకు అందించే పరిహారం ఆలస్యమవుతున్నందున, ఈ నెలాఖరుకు సర్వే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. కాగా మెట్ట, జరీబు భూములపై అధికారిక ప్రకటన చేసేందుకు సీఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top