పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది: రోజా

పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది: రోజా - Sakshi


నంద్యాల ఓటమి తెలిసే పవన్‌ మద్దతు ఇవ్వలేదు

ఎన్నికలు ఆపేందుకే చంద్రబాబు నంద్యాలకు..

కుట్రలకు వందశాతం పేటెంట్‌ రైట్‌ చంద్రబాబుదే.


ఎన్ని కుట్రలు చేసినా నంద్యాల ప్రజల మద్దతు వైఎస్‌ఆర్‌ సీపీకే..




నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ ఓటమి తథ్యమని పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది కాబట్టే ఆ పార్టీకి తన మద్దతు ప్రకటించలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ అవమానం తన ఖాతాలో పడకుండా పవన్‌ తటస్థంగా ఉంటానన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బెదిరింపులకు నంద్యాల ఓటర్లు భయపడే పరిస్థితి లేదు. ఆయనకు నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.


అందుకే ప్రచారానికి రానవసరం లేదనుకున్న చంద్రబాబు, పరిస్థితి మారే సరికి బట్టలు సర్దుకుని నంద్యాలలో మకాం వేసేందుకు వస్తున్నారు. ఉప ఎన్నికను ఎలాగైనా ఆపాలనే ఆయన నంద్యాల వస్తున్నారు. రేపటి నుంచి చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు మొదలవుతాయి. అందుకే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ముందే చెప్పారు. నంద్యాల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. కుట్రలకు వందశాతం పేటెంట్‌ రైట్‌ చంద్రబాబుదే.



ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబుకు బుద్ధి చెప్పే అవకాశం రావడం నంద్యాల ప్రజల అదృష్టం. సీమకు రావాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. ఇక ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరులో  వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని మన్నవరం ప్రాజెక్ట్‌కు నిధులు అందకుండా చేశారు. అలాగే రాయలసీమకు రావాల్సిన సెంట్రల్‌ వర్సిటీని మరిచిపోయారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులు తమకు న్యాయం చేయడంటూ ఏడు, ఎనిమిది నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా వారిని పట్టించుకోని మైనార్టీ ద్రోహి చంద్రబాబే.



కర్నూలు ఆస్పత్రిలో 300 ఎలుకలు పట్టడానికి రూ.60 లక్షలు విడుదల చేశారు. అంటే ఒక్కొక్క ఎలుకకు రూ.20వేలు ఖర్చు చేశారు. బాబు పాలన తీరు ఇలా ఉందనటానికి ఇదో ఉదాహరణ. చంద్రబాబు గజినీ... ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తుండవు. ఓర్వకల్లు ప్రాజెక్టు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. చంద్రబాబు గురించి రాయలసీమ ప్రజలకు బాగా తెలుసు. నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనాల్సిందే. వైఎస్‌ఆర్‌ కుటుంబం వెంటే నంద్యాల ప్రజలు ఉంటారు. నంద్యాల ప్రజలు పౌరుషం ఉన్నవారు. చంద్రబాబు ఎన్ని డబ్బులిచ్చినా వైఎస్‌ఆర్‌ సీపీనే ఆదరిస్తారు.’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top