ప్రజల ప్రాణాలు పట్టవా ?

ప్రజల ప్రాణాలు పట్టవా ?


చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమిటి... ప్రమాదం సంభవించాక నెత్తినోరూ బాదుకుంటే వచ్చే దేమిటి... ప్రాణాలు పోయాక నిబంధనలు గుర్తుకు వస్తే చేయగలిగెదేమిటి... ఇలాంటి ప్రశ్నలకు ‘ఏమీ లేదు’అనే సమాధానమే వస్తోంది. మరి ఈ విషయాలు తెలియని అధికారులు ఉన్నారా అంటే ‘లేరు’ అని సమాధానమే వస్తోంది. ఇవన్నీ తెలిసి నిబంధనలను కాలరాస్తున్న అధికారులు ఎవరైనా ఉంటారా అని అడిగితే ‘ఉంటారు కాదు ఉన్నారు’ అని వినిపిస్తోంది... ఎక్కడో కాదు అవినీతి ముసుగేసుకుని, ప్రజల ప్రాణాల కన్నా దీపావళి వ్యాపారులు ఇచ్చే డబ్బులే మిన్న అనుకుంటూ  మన మధ్యే తిరుగుతున్నారు. ఇది నిజమో కాదో మీరే చదవండి...!

 


 సాక్షి, గుంటూరు

 ప్రతి దీపావళికి ఎక్కడ పేలుడు సంభవిస్తుందోననే భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. నిబంధనలు పాటించాల్సిన వ్యాపారులు, వాటిని సరిచూడాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడమే ఇందుకు కారణం. నిన్నగాక మొన్న తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలోని బాణ సంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం సంభవించి 17 మంది మృతి చెందిన దుర్ఘటన అందరి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అక్కడ అంతటి ఘోరం జరిగినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయం.




      జిల్లాలో అక్రమంగా మందు గుండు నిల్వ చేసిన గోడౌన్లపై తనిఖీలు లేవు, అక్రమ వ్యాపారులపై చర్యలూ లేవు. కాకతాళీయంగా బయటపడితే మినహా అక్రమ నిల్వలను బయటకు తీయడం లేదు. నిబంధనలను పట్టించుకోవడం లేదు.

      రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్, నగరపాలక సంస్థ, అగ్నిమాపక శాఖ ఇన్ని శాఖల అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోవడం అధికారుల లోగుట్టును బయటపెడుతోంది.

      జిల్లా వ్యాప్తంగా 23 హోల్‌సేల్ బాణ సంచా దుకాణాలు ఉన్నాయి. అందులో మూడు షాపులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. నరసరావుపేటలోని ఒక దుకాణం మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

     ఈ  వ్యాపారుల్లో ఒకరైన మలిశెట్టి సుబ్బారావు రూ. కోట్ల విలువ చేసే బాణ సంచాను వివిధ గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసినట్టు వెల్లడైంది. చౌడాయ పాలెం వద్ద ఒక్క గోడౌన్‌లో తనిఖీ చేసిన పోలీసులకు రూ.2.88 కోట్ల విలువ చేసే బాణ సంచా అక్రమ నిల్వలు దొరికాయి.




      ఆదివారం నాడు అదే ప్రాంతంలో శివరామకృష్ణ గోడౌన్స్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల విలువ చేసే బాణ సంచా స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్‌ను సీజ్ చేశారు.ఇలా  మొత్తం రూ.4.8 కోట్ల విలువ చేసే బాణ సంచా అక్రమ నిల్వలు బయటపడ్డాయి.

      ఈ వ్యాపారికి నగరంలో పలు గోడౌన్లు ఉన్నాయని, స్థానిక చుట్టుగుంట సెంటర్‌లో హోల్‌సేల్ దుకాణం ఉందని సమాచారం. ఈ దుకాణానికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదని ఆ శాఖ జిల్లా అధికారి జిలాని తెలిపారు. నెలరోజుల కిందట నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని చెప్పారు.




      గత శుక్రవారం పోలీసు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులతో కలసి అగ్నిమాపక శాఖ అధికారులు  మలిశెట్టి సుబ్బారావు షాపును తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించినా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆయన ఓ మాజీ మంత్రికి సన్నిహితుడు కావడం వల్లే అధికారులు వెనకంజ వేస్తున్నారని సమాచారం.




 అనుమతి పొందాలంటే నిబంధనలు తప్పనిసరి

 బాణ సంచా హోల్‌సేల్ దుకాణాలు నిర్వహించే వారు తమ దుకాణాల చుట్టుపక్కల జనావాసాలు, ఇతర వ్యాపార సముదాయాలు లేకుండా చూసుకోవాలి.

      దుకాణానికి చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేందుకు వీలుగా ఆరు మీటర్ల వరకు స్థలం వదలాలి.

      దుకాణం చుట్టుపక్కల హైడ్రిన్ సిస్టమ్ పైపులైను, గోడౌన్ లోపల హోజ్‌రీల్ సిస్టమ్ వాటర్ పైపులైను, స్పింక్లర్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి.

      బాణ సంచా వ్యాపారులు ఇలాంటివీ ఏవీ పాటించడం లేదు.

      ఇవన్నీ ఉంటేనే అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

      అయితే ఇలాంటివి ఏవీ లేకున్నా అనుమతులు ఎందుకు ఇస్తున్నారో తెలియందే కాదు. ప్రమాదం జరిగితే అధికారుల అవినీతికి అనేక ప్రాణాలు బలికాక తప్పదని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

      ఇప్పటికైనా అక్రమ బాణసంచా వ్యాపారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top