ఓర్పునకు మారుపేరు మహిళ


ఒంగోలు టౌన్ : ఓర్పు, నేర్పు, క్రమశిక్షణకు మహిళ మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల ముగింపు సభ ఆదివారం రాత్రి ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్నమంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ  ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ముఖ్యమంత్రి ప్రకటించారని ఉద్యోగులంతా అంకితభావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. 


 


ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ మహిళల విషయంలో ప్రజల ఆలోచనా విధానం మారాలన్నారు. ఇప్పటికే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి ఆలోచనా విధానం మానుకోవాలన్నారు.  మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పాటు చైల్డ్‌కేర్ లీవ్ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు.  ఏపీ ఆర్‌ఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అందుకు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లే నిదర్శనమన్నారు. జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులు కావాలని అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే వారి కుటుంబంతో పాటు సమాజంలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్‌జీవో అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ రత్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతి, ఎమ్మెల్యే భార్యతో పాటు ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సచివాలయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ, ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, డీఎంహెచ్‌వో యాస్మిన్, సాంఘిక సంక్షేమ శాఖ జీడీ సరస్వతి, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ శారద తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top