‘పశ్చిమ’ ముంగిట్లో పాస్‌పోర్ట్ సేవలు


భీమవరం : జిల్లా ముంగిట్లో పాస్‌పోర్ట్ సేవలు అందనున్నాయి. గగన విహారం ఇక సులభతరం కానుంది. భీమవరంలో పాస్‌పోర్ట్ లఘుసేవా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయగోదావరితో పాటు కృష్ణా జిల్లావాసులకు పాస్‌పోర్ట్ సేవలు సులభతరం కానున్నాయి. ఈ ప్రాంతం నుంచి వందలాది మంది ఉద్యోగ, ఉపాధి, విద్య నిమిత్తం విదేశాలకు వెళుతున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాలకు విహార యాత్రకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీరంతా ఇప్పటి వరకు పాస్ట్‌పోర్ట్ కోసం విశాఖ వెళ్లాల్సి వస్తోంది.

 

 రోజుకు 500 మంది వరకు..

 ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రోజూ 500 మంది వరకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తులు చేస్తున్నట్టు అంచనా. ఇప్పటి వరకు వీరంతా పాస్‌పోర్ట్ కోసం విశాఖ వెళుతున్నారు. దీంతో సమయంతో పాటు సొమ్ములు ఖర్చవుతున్నాయి. భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం అందుబాటులోకి రావడంతో వీరి ఇబ్బందులు తీరనున్నాయి. భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌కు దగ్గరలోని పాతబస్టాండ్ పక్కన లఘుసేవా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటుకు బీజం వేశారు. ఒకానొక దశలో కేంద్రాన్ని రాజమండ్రి తరలించడానికి ప్రయత్నాలు జరిగినా ఎట్టకేలకు భీమవరంలోనే ఏర్పాటుచేశారు.

 

 ఐదు రోజులు.. ఆరు కేంద్రాలు

 సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజులు పాటు పాస్‌పోర్ట్ సేవలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చు. ఇందు కోసం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేశారు.  ఎ కౌంటర్‌లో టోకెన్లు తీసుకుంటారు, బి కౌంటర్‌లో దరఖాస్తుల పరిశీలన, సీ కౌంటర్‌లో పాస్‌పోర్టు వివరాల నమోదు చేస్తారు. దరఖాస్తుదారుని వివరాలను విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రానికి పంపుతారు. అక్కడి నుంచి  వారం రోజుల్లో పాస్‌పోర్టు ఇంటికి చేరే అవకాశం ఉంది. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు సాధారణ వ్యక్తులు ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, ఎనగ్జర్ ఏ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. విద్యార్థులు కళాశాల నుంచి గుర్తింపు పత్రం, విద్యార్హత, తదితర పత్రాలు సమర్పించాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top