ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట - Sakshi


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సింది పోయి.. వాళ్లకు పెద్దపీట వేస్తూ మైకు ఇవ్వడంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజి వ్యవహారంపై చర్చకు పట్టుబట్టి వైఎస్ఆర్‌సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా వారిని అడ్డుకునేందుకు పలువురు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో పార్టీ ఫిరాయించిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కూడా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మైకు ఇచ్చారు.



ఆయన వైఎస్ఆర్‌సీపీ తరఫున గెలిచి, ఆ తర్వాత పచ్చకండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాన్ని విమర్శించేందుకు ఆయనకు మైకు ఇవ్వడాన్ని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు. వెంకటరమణ వెనకాలకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దాంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేచి.. తమ బెంచీల వద్దకు వచ్చి నినాదాలు చేయొద్దంటూ ప్రతిపక్షాన్ని కోరారు. అయితే సాధారణ సభ్యుల వద్దకు వెళ్లకుండా కేవలం పార్టీ ఫిరాయించిన వారి వద్దకు మాత్రమే వెళ్తున్న విషయాన్ని ఆయన గమనించలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top