కరువైన ‘విద్యా దీవెన’


ఒంగోలు సెంట్రల్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు...వారు మధ్యలోనే బడి మానేయకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ విద్యాదీవెన పథకం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ పథకం కింద ఉపకార వేతనాలు పొందేందుకు 2013-14 విద్యా సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు, ఈ విద్యా సంవత్సరం సగం గడిచిపోయినా..ఇంత వరకు ఉపకార వేతనాలు అందించలేదు. కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలనుకున్న విద్యార్థులకూ బ్యాంకర్లు, మీసేవ కేంద్రాలతో సమస్యలు ఎదురవుతున్నాయి.



2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాలో 3,500 మంది విద్యార్థులు ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా..1500 మందికి మాత్రమే ఉపకార వేతనాలు మంజూరు చేశారు. మిగిలిన వారికి అవసరమైన నిధులు రూ.35 లక్షలు లేకపోవడంతో ఆపేశారు. వారికి ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థులకు కలిపి ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.



ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో 9, 10 తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డేస్కాలర్లకు నెలకు రూ.150, హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.350 చొప్పున ఉపకార వేతనాలు అందిస్తారు. అవి కాకుండా పుస్తకాల కొనుగోలుకు డేస్కాలర్లకు రూ.750, హాస్టల్ విద్యార్థులకు వెయ్యి రూపాయలు ఇస్తారు. అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌కార్డు నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, మీసేవా కేంద్రం నుంచి పొందిన ఆదాయ, కులధ్రువీకరణ పత్రంతో పాటు విద్యార్థి చదివే పాఠశాల హెచ్‌ఎం అందించే బోనఫైడ్ సర్టిఫికెట్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  



జిల్లావ్యాప్తంగా 1700 పాఠశాలల్లో 13 వేల మందికిపైగా ఎస్సీ విద్యార్థులున్నారు. వీరిలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈనెల 15వ తేదీ వరకు గడువు విధించారు. దరఖాస్తులు చాలా స్వల్పంగా రావడంతో మరో 15 రోజులు అంటే ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయినా జిల్లాలో ఇప్పటి వరకు 2,400 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.



మీ సేవ కేంద్రాలతో ఇక్కట్లు:

విద్యార్థులందరికీ బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించినా..బ్యాంకర్లు మాత్రం రూ.500 బ్యాలెన్స్‌తో అయితేనే ఖాతా తెరుస్తామంటున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బ్యాంకు ఖాతా ఉంటే ఆ ఖాతాని జాయింట్ అకౌంట్‌గా మార్చుకుని విద్యార్థి పేరును ఆ అకౌంట్‌లో చేర్చవచ్చు. కానీ ఈ విషయాల్ని అధికారులు వారికి తెలియజేయడం లేదు.



ఆన్‌లైన్ సౌకర్యం ఉన్న బ్యాంకుల్లోనే ఖాతాలు తెరవాల్సి రావడంతో..గ్రామీణ ప్రాంతాల్లో అవి అందుబాటులో లేక దూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో ఖాతాలు తెరవాల్సి వస్తోంది. ఎలాగో నగదు సమకూర్చుకుని బ్యాంకుల వద్దకెళ్లినా వారు ఆ పత్రాలు లేవు, ఈ పత్రాలు లేవంటూ విద్యార్థులను తిప్పుకుంటున్నారు. ఆధార్‌కార్డు లేని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇంకా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రా లు మీ సేవా కేంద్రాల నుంచే తేవాల్సి ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల కోసం 10 నుంచి 15 రోజుల గడువు విధిస్తుండటంతో నూతన విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.  



ఈనెల 30 వరకు గడువుంది..కే సరస్వతి, డీడీ

విద్యాదీవెన పథకం కింద ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నెల 30 వరకూ గడువు పొడిగించింది. విద్యార్థులకు జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరవాలని బ్యాంక్‌లకు ఈపాటికే ఆదేశాలు అందాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top