‘ఉపకార’ వెతలు


స్కాలర్‌షిప్ రావాలంటే తల్లిదండ్రుల ఆధార్ తప్పనిసరి

తల్లిదండ్రులు లేని విద్యార్థుల గతేమిటి?

తరువుకొస్తున్న గడవు


 

చీరాల: కర్షకులను, కార్మికులను, ఉద్యోగులను, నిరుద్యోగులనే కాదు తాజాగా విద్యార్థుల్లో కూడా కల్లోలం రేపుతోంది టీడీపీ ప్రభుత్వం.   కత్తిరింపుల ప్రహసనం విద్యార్థి చెంతకు చేరింది.  స్కాలర్ షిప్‌కు దర ఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఆధార్ కార్డుతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార్ కార్డులను తప్పనిసరి చేయడంతో విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  తల్లిదండ్రులు లేని, లేదా దూరమైన విద్యార్థులు ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.



ఈ నెల 15వ తేదీతో ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌లను అప్‌లోడ్ చేసేందుకు గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అద్దంకికి చెందిన కోండ్రు డేవిడ్‌రాజ్ అక్కడి ఎన్టీఆర్ మెమోరియల్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తల్లిదండ్రుల అధార్ కార్డులను అందిస్తేనే ఆన్‌లైన్‌లో లింక్ అవుతుందని, లేకపోతే ఉపకారవేతనం వదులుకోవల్సిందేనని అధికారులు, నెట్ సెంటర్ల యజమానులు చెప్పడంతో ఈ విద్యార్థి భవిత అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే డేవిడ్‌రాజ్ తండ్రి పదేళ్ల కిందటే చనిపోయాడు.



దీనికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో జతచేసినా ఆన్‌లైన్ స్వీకరించడం లేదు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవిస్తే తామేమీ చేయలేమని, ప్రభుత్వం ఆ విధంగా నిబంధనలు నిర్దేశించిందని అధికారులు జవాబివ్వడంతో ఏమి చేయాలో తెలియక అవస్థలు పడుతున్నానని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు.  అదే కళాశాలకు చెందిన వియ్యాల అంకమ్మరావు, జొన్నలగడ్డ దివ్య, గంగవరపు లక్ష్మీపావని, ఆరికట్ల గోపీకృష్ణతోపాటు ఇంకొంతమంది విద్యార్థులు ఇదే పరిస్థితిని చవిచూస్తున్నారు. ఇదే తరహా ఇబ్బందులు జిల్లాలో వందలాదిమంది ఎదుర్కొనే అవకాశం ఉంది.



కొంతమంఇ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోవడం, మరి కొంతమంది కలహాలతో విడిపోవడం, వదిలి వెళ్లిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటివారి పిల్లలు చదువుకుంటుంటారు. ఈ నేపధ్యంలో ఇలాంటి నిబంధనలు ముప్పుతిప్పలు పెడుతున్నాయని వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువకోవాలనే ఆకాంక్షతో ఉపకార వేతనాలను, ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకాలను ప్రవేశపెట్టి విద్యాదాతగా పేరు తెచ్చుకుంటే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే  బాబు అపహాస్యం పాలవుతున్నారని బాధితులు వాపోతున్నారు. తమ చదువులు ఎలా కొనసాగించాలని ప్రశ్నిస్తున్నారు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, తదితర విద్యార్థులు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top