పంచాయతీలకు ‘పవర్’ కట్


  • అన్ని అధికారాలు వీజీటీఎం ఉడాకే

  •  అనుమతులు ఇక్కడినుంచే

  •  ఉడా పరిధిలోని 826 పంచాయతీలకు ఉత్తర్వులు

  • సాక్షి, విజయవాడ/పెనమలూరు : వీజీటీఎం ఉడాకు సర్వాధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఉడా పరిధిలోని పంచాయతీలకు ఇప్పుడున్న భూలావాదేవీలు, భూబదిలీలు, అనుమతుల మంజూరు.. ఇలా అనేక అధికారాలను రద్దుచేసి వాటిని ఉడాకు బదలాయించింది. ఈ మేరకు బుధవారం సర్కారు జీవో జారీ చేసింది. ఇకపై ఉడా పరిధిలోని పంచాయతీలో నిర్మించే ప్రతి భవనం, లేఅవుట్‌కు ఉడా నుంచే అనుమతి పొందాలి. వాస్తవానికి ఆవిర్భావం నుంచే ఉడాకు ఈ అధికారాలున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం వీటిని 2009లో గ్రామ పంచాయతీలకు అప్పగించారు. మళ్లీ ఇప్పుడు రద్దు చేశారు.

     

    అప్పుడలా.. ఇప్పుడిలా..



    వీజీటీఎం ఉడా పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 826 గ్రామాలున్నాయి. 52 మండలాల పరిధిలో 7,067 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు విజయవాడ, గుంటూరు నగరపాలకసంస్థలు, మంగళగిరి, తెనాలి, సత్తెనపల్లి, పొన్నూరు, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాలు కూడా ఉడా పరిధిలోకి వస్తాయి.



    ఈ క్రమంలో ఉడా పరిధిలోని గ్రామాల్లో వేసే లేఅవుట్లు (రియల్ ఎస్టేట్ వెంచర్లు), భారీ భవన సముదాయాలకు ఉడా నుంచి అనుమతులు తప్పనిసరి. ఉడాకు ఉన్న సిబ్బంది కొరత, ఇతర కారణాలతో  2009 జనవరి 21న జీవో నంబర్ 45 ద్వారా కొన్ని పరిధుల పరిమితులు విధించి వాటి అనుమతులు మంజూరు చేసే అధికారాలను  పంచాయతీలకు అప్పగించారు.  



    1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 మీటర్ల ఎత్తులోపు నిర్మించే జీ ప్లస్ 2 భవనాలకు పంచాయతీల అనుమతి సరిపోతుంది. ఆ పరిధి దాటితే ఉడా నుంచి పొందాలి. గ్రామకంఠంలో మూడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే లేఅవుట్లకు పంచాయతీ అనుమతి సరిపోతుంది. అలాగే స్థలాల పేరు బదలాయింపు, రెండుగా విభజించే అధికారం గ్రామ పంచాయతీకి ఉండేది. తాజాగా వెలువడిన జీవో ఆ అధికారాలన్నీ రద్దయ్యాయి. ఈ ఉత్తర్వు ప్రతిని ఉడా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పంపనుంది.

     

    రాజధాని భూసేకరణ నేపథ్యంలో..



    రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా పంచాయతీల అధికారాలను రద్దు చేశారు. భూసేకరణకు కొన్ని ఇబ్బందులు ఉండడం, ల్యాండ్ పూలింగ్ నిర్వహించాల్సి ఉండడంతో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఇప్పటికే ఉడా పరిధిలో అనుమతులన్నీ నిలిపివేశారు. ఇంతకుముందే గత నెలలో కలెక్టర్ రఘనందన్‌రావు మెగా సిటీగా ఆవిర్భవించనున్న 50 గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని భవనాలు, లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. వాటి ప్లాన్‌తోసహా సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో అనుమతులు నిలిపివేయాలని కలెక్టర్ గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పుడు ఉడా పరిధిలోని అన్ని గ్రామాలకు దీనిని వర్తింపజేశారు.

     

    ఆదాయం గోవిందా..



    సర్కారు తాజా ఉత్తర్వులతో గ్రామ పంచాయతీలు అధికారాలు కోల్పోయాయి. ఇంటి ప్లాన్‌ల వలన ఆదాయం పుష్కలంగా వస్తుంది. కొత్తగా కట్టిన ఇళ్లకు పన్నుల రూపేణా ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. పాలకవర్గాలకు అధికారాలు ఉండడంతో ఇళ్ల ప్లాన్లు ప్రజలు సులువుగా పొందుతున్నారు. ఇకమీదట  పంచాయతీలు నిస్సారంగా మారే ప్రమాదం ఏర్పడింది.

     

    పాలకవర్గాల ఆగ్రహం



    టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా అధికారాలకు కోత పెట్టడంపై పంచాయతీల పాలక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు విరుద్ధంగా ప్రభుత్వ పనితీరు  ఉందని గ్రామ పాలకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం  జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో నాయ్యపరంగా పోరాటం చేస్తామని పాలక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top