పంపకాల పంచాయితీ!


సాక్షి, కర్నూలు:  ‘‘హెడ్‌కానిస్టేబుళ్లూ, మేమూ ఒక్కటేనా.. ఇకపై అలా అంటే కుదరదు.. కచ్చితంగా మా వాటా వారి కంటే ఎక్కువ ఉండాల్సిందే.’’ - ఇదీ.. ఇటీవల జిల్లాలోని ఓ ఎక్సైజ్ స్టేషన్ సీఐతో ఎస్‌ఐ డిమాండ్.



 ఎక్సైజ్ శాఖలో మామూళ్ల మత్తు పరాకాష్టకు చేరిందా..? పంపకాల్లో తేడాలు అధికారుల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయా..? అంటే పై ఉదాహరణే ఆ వాదనకు నిలువుటద్దంగా నిలుస్తోంది. ప్రతి నెలా మద్యం సిండికేట్ల నుంచి స్టేషన్లకు అందుతున్న మామూళ్లను క్యాడర్ వారీగా పంపిణీ చేయడంలో తేడాలు ఉండటంతో ఇప్పటి వరకు గుట్టుగా సాగుతున్న బాగోతాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి.



ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన వనరుల్లో మద్యం ఒకటి. ఎంఆర్‌పీకే దుకాణదారుడు మద్యం విక్రయించాలని ప్రభుత్వ నిబంధన. కానీ, అలా చేయడం వల్ల తమ పెట్టుబడికి ఏమాత్రం గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో వ్యాపారులు సిండికేటుగా మారి గతంలో ఇష్టానుసారంగా అధిక ధరలకు మద్యం విక్రయించారు.



అయితే ఏడాదిన్నర క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈ ఎక్సైజ్ శాఖ వసూళ్ల బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో రాజకీయ నాయకులతోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది హడలిపోయిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా ఎక్సైజ్ సిబ్బందిలో మార్పు వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వాతావరణం కాస్త చల్లబడినట్లు కనిపించడంతో మళ్లీ చేయి చాపడం మొదలు పెట్టారు.



 అసలేం జరిగిందంటే..!

 టెండర్ల ద్వారా మద్యం షాపులను దక్కించుకున్న యజమానులందరినీ సిండికేటుగా ఏర్పాటు చేసే బాధ్యతను ఈసారి ఎక్సైజ్ అధికారులు నెత్తికెత్తుకోవడం గమనార్హం. దీంతో జిల్లాలో మద్యం సిండికేట్లు ఎంఆర్‌పీకి మించి విక్రయాలు సాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇందుకు సహరిస్తున్నందుకు ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు ఒక్కో దుకాణం నుంచి రూ.30 వేల చొప్పున ముట్టజెబుతున్నారు. అయితే, అధికారుల మధ్య ఈ మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో.. గతేడాది నవంబర్‌లో పత్తికొండ ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐ మధ్య వాగ్వాదానికి దారి తీయడం విదితమే.



 నీ ప్యాకెట్ మనీ నుంచి ఆయనకు సర్దండి..!

 నంద్యాల పరిధిలోని ఓ ఎక్సైజ్ స్టేషన్‌లో ఎస్‌ఐ, సీఐల మధ్య కొన్ని నెలలుగా మామూళ్ల పంపిణీ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. ‘హెడ్ కానిస్టేబుళ్లూ మేమూ ఒక్కటేనా..!? ఇకపై అలా అంటే కుదరదు.. కచ్చితంగా మా వాటా వారి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే’ అంటూ ఓ ఎస్‌ఐ ససేమిరా అనడంతో ఎస్‌ఐ ఒత్తిళ్లను తట్టుకోలేకపోయిన సీఐ జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి వద్ద మొరపెట్టుకున్నారు. ఆ వెంటనే ఆ ఉన్నతాధికారి నంద్యాల పర్యటనకు వెళ్లారు.



ఇద్దరు అధికారులను పిలిచి సర్దుకుపోవాలని హితవు పలికారు. అయినా ఆ ఎస్‌ఐ మాట వినకపోవడంతో చివరికి సీఐనే సర్దుకుపోమని, మామూళ్ల విషయం రచ్చకెక్కకుండా ఆ ఎస్‌ఐకు ప్యాకెట్ మనీ నుంచి సర్దండంటూ సీఐకి సలహా ఇచ్చినట్లు సమాచారం. అయినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సెప్టెంబర్‌కు సంబంధించిన సిండికేట్ల ద్వారా స్టేషన్‌కు మామూళ్ల రూపంలో అందిన రూ.6 లక్షలను తీసుకుని ఆ సీఐ ఏకంగా సెలవు పెట్టి వెళ్లిపోవడం ప్రస్తుతం స్టేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top