పంచాయతీ కార్యదర్శులు కావలెను

పంచాయతీ కార్యదర్శులు కావలెను


462 మంది కార్యదర్శుల పోస్టులు ఖాళీ

పట్టణ ప్రాంతాల్లో పనిచేసేందుకే మొగ్గు

గ్రామాల్లో కార్యదర్శలకు అదనంగా బాధ్యతలు  




సైదాపురం(వెంకటగిరి) : గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్‌తో పాటు కీలకపాత్ర పోషించాల్సిన కార్యదర్శుల పోస్టులు జిల్లాలో అధికంగా ఖాళీగా ఉన్నాయి.  ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించిందే తప్ప అలా జరగలేదు. దీంతో పల్లెల్లో అభివృద్ధి పడకేసింది. జిల్లాలో 940 పంచాయతీలకు 462 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 478 పంచాయతీలకు సమీప గ్రామ పంచాయతీ కార్యదర్శులే ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు నిర్వహిన్నారు.



ఈ క్రమంలో ఒక్కో కార్యదర్శి నాలుగు పంచాయతీలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తుండటంతో ఏ పంచాయతీకి కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. కాగా పల్లెలల్లో కార్యదర్శుల కొరత కారణంగా పనులు సక్రమంగా జరగడంలేదు. వర్షాలు అడపాదడపా పడుతున్నా పారిశుద్ధ్య పనులు సాగడంలేదు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యదర్శులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామందికి తమ ఊరికి కార్యదర్శి ఎవరో తెలియదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.



అక్కడే బాగుంటుంది..

తక్కువ సంఖ్యలో ఉన్న కార్యదర్శులు కూడా అధిక భాగం నియోజకవర్గ కేంద్రాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సమీపంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో బదిలీలు జరగ్గా అనేకమంది రీత్యా గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, నెల్లూరు నగరం సమీప ప్రాంతాల్లో మాత్రమే పనిచేసేందుకు వెళ్లారు. ఇంకా కొంతమంది పట్టణాలకు డెప్యుటేషన్‌ చేయించుకుని వెళుతున్నారు.



బాధ్యతలు ఇవే..  

⇒  గ్రామ పంచాయతీల్లో రికార్డులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు ఇంటి పన్నులను వసూలు చేయాలి.

⇒  సర్పంచులతో కలిసి పంచాయతీల్లో అన్ని కార్యక్రమాలను నిర్వహించాలి.

⇒  సమావేశాలకు హాజరై తీర్మానాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరించాలి.

⇒  పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి. భూములు, స్థలాలు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

⇒  స్వచ్ఛమైన నీరును అందించడంతో పాటు గ్రామాల్లో రోగాలు రాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి.

⇒   జనన, మరణ సమాచారాన్ని ప్రతి నెల 5వ తేదీ లోగా రెవెన్యూ అధికారులకు పంపించాలి.

⇒  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలను అందించేందుకు గ్రామసభలను నిర్వహించాలి.

⇒   గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందించే విషయంలో సహాయకారిగా వ్యవహరించాలి.




ఉదాహరణకు..

⇒  చిల్లకూరు మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా తొమ్మిది మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

⇒  సైదాపురం మండలంలో 31 గ్రామ పంచాయతీలకు 11 మంది ఉన్నారు.  

⇒  రాపూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలుండగా ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top