అధికారాలకు కత్తెర


పంచాయతీలపై పెన్షన్ కమిటీల పెత్తనం

17 నెలలుగా వేతనాల్లేక సర్పంచ్‌ల వెతలు

గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి

శీతాకాల సమావేశాల్లో చర్చించాలంటూ

సర్పంచ్‌ల సంఘం బహిరంగ లేఖ


 

విశాఖపట్నం : పగ్గాలు చేపట్టి పదిహేడు నెలలైంది..నేటికీ రూపాయి వేతనం అందుకోలేదు. పోనీ అభివృద్ధి చేద్దామంటే నిధుల్లేవు..కేంద్రం మంజూరు చేసే నిధులను రాష్ర్టం వివిధ బకాయిల రూపంలో సర్దుబాటు చేస్తూ పంచాయతీల ఖజానాను ఖాళీ చేస్తోంది. మరో పక్క  అధికారాలకు కోత పెడుతూ జన్మభూమి పెన్షన్ కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లయింది. ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోక పోగా, సర్పంచ్‌ల అధికారాలకు కత్తెరేస్తూ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తోంది. దీనిపై పార్టీలకతీతంగా రాష్ర్ట స్థాయిలో పోరుకు వారంతా సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ  తీరుపై అధికార పార్టీకి చెందినవారే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ సమస్యలను చర్చించి న్యాయంచేయాలంటూ రాష్ర్ట సర్పంచ్‌ల సంఘం అధికార, ప్రతిపక్ష పార్టీలకు బహిరంగలేఖ రాశాయి. దానిని ఆదివారం విశాఖపట్నంలో విడుదల చేశాయి. ముఖ్యంగా సర్పంచ్‌లపై పెత్తనం చెలాయిస్తున్న పెన్షన్ కమిటీ తీరుపై రగిలిపోతున్నారు.



ఈ కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి,ఇద్దరు డ్వాక్రాసంఘాల మహిళలు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉన్నారు. సామాజిక కార్యకర్తల ముసుగులో నియమితులయ్యే స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకే ఫింఛన్ల కోత, మంజూరుతో పాటు ఇతర పనులన్నీ జరుగుతున్నాయి. గ్రామ పరిపాలనలో పెన్షన్ కమిటీల పెత్తనం వల్ల నిరక్ష్యరాస్యులైన  సర్పంచ్‌లు, రిజర్వేషన్ ప్రాతిపదికన ఎన్నికైన ఎస్సీ,ఎస్టీ, బీసీ సర్పంచ్‌లపై సామాజిక కార్యకర్తల ముసుగులో అగ్రవర్ణాలపెత్తనం పెరిగి పోయిందని సంఘం ఆక్షేపణ  వ్యక్తం చేసింది.తక్షణం ఈ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరిగి 17నెలలైనానేటికీ గౌరవ వేతనం ఇవ్వ లేదని..అసలు తమ గౌరవ వేతనం ఎంతో తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. పరోక్షంగా పంచాయతీల్లో అభివృద్ధి పడుతోందని వాపోతున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా మేజర్ పంచాయతీ సర్పంచ్‌కు రూ.10 వేలు, మైనర్ పంచాయతీ సర్పంచ్‌కు రూ.8వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషలాఫీసర్ల పాలనలో ఉన్న విద్యుత్ బకాయిలకు తమను బాధ్యులను చేయడం సరికాదు. ఇప్పటి వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వమే చెల్లించి, ఇక నుంచి వచ్చే కరెంటుబిల్లులకు మాత్రమే తమను బాధ్యులను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల్లో ప్రైవేటు టీచర్స్‌కు ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం ప్రజలతో నేరుగాఎన్నికైన సర్పంచ్‌లకు ఎందుకు కల్పించలేదని ఈ సంఘం ప్రశ్నిస్తోంది. తక్షణమే సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పిస్తూ జీవో జారీచేయాలని డిమాండ్ చేసింది. రాజధాని ప్రాంతంలోఉన్న గ్రామాల హక్కులను హరిస్తూ జారీ చేసినజీవో 201పై కూడా సర్పంచ్‌ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ జీవోను వెంటనే రద్దుచేయడంతో పాటు పంచాయతీలకు పూర్తి జవసత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top