అంతా బూటకమే

అంతా బూటకమే - Sakshi


ఓ వైపు చంద్రబాబు రైతు సాధికారత సదస్సులు పెట్టి రుణమాఫీ పత్రాలు అందజేస్తుంటే ఇంకోవైపు రైతులు అదంతా పచ్చి బూటకమంటూ కన్నెర్ర చేస్తున్నారు. సీఎం జిల్లాలో ఉన్న సమయంలోనే బ్యాంకులను ముట్టడించి సంబంధిత అధికారులను నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, పర్చూరు, మండలాలతోపాటు త్రిపురాంతకంలోనూ నిరసన గళాలు వినిపించాయి.  

 

యర్రగొండపాలెం: ఎన్నికల ముందు బూటకపు వాగ్దా నాలు చేసి టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కారని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. రైతుల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం  త్రిపురాంతకం మండలం దూపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన తొలి సంతకం రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల రద్దు ఫైలుపై సంతకం చేశానన్నారు. అప్పటి నుంచి ఆరు నెలలపాటు రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలలోపు రుణాలు ఏకమొత్తంలో రద్దు పరుస్తున్నామని, ఆ పైబడిన రుణాలు విడతలవారీగా రద్దు చేస్తామని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీకి సంబంధించి రైతు సాధికారిత కార్యక్రమాల్లో తప్పుడు పత్రాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఉద్యానవన పంటలకు రుణమాఫీ లేదంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.



రాజధాని పేరుతో పచ్చటి పొలాలను లాక్కోటానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారన్నారు. దొనకొండలో 60 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాదని, జిల్లాకు సాగర్‌నీరు సక్రమంగా రావడం లేదని, ఈ విషయం తెలిసిన అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమకు ఏమీ పట్టనట్లున్నారని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దపోతు చంద్రమౌళి రెడ్డి, నియోజకవర్గం అధికార ప్రతినిధి నర్రా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, నాయకులు దగ్గుల వేణుగోపాలరెడ్డి, ఆళ్ల కృష్టారెడ్డి, పోలిరెడ్డి, ఒంటేరు రాజయ్య, లక్ష్మీబాయి, జి.నాసర్‌రెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top