పలమనేరు నరహంతుకుల ఘాతుకాలెన్నో!


  • వేలూరు సెంట్రల్ జైలులోనే ప్లానింగ్

  • రూ.కోట్ల విలువైన కాపర్ లారీలే టార్గెట్

  • ఇప్పటికీ వెలుగుచూడని కేసులెన్నో

  • పలమనేరు: లారీలను హైజాక్ చేసి డ్రైవర్లను కిరాతకంగా హత్య చేసే పలమనేరుకు చెందిన నరహంతకుల ఘాతుకాలు ఇప్పటివి కావు. ఏడేళ్లుగా ఇలాం టి ఘటనలకు పాల్పడుతూనే ఉంది. పలమనేరులో కాపురముండే గుండుగల్లు శ్రీరాములే ఈ ముఠాకు నాయకుడు. ఇతను తయారు చేసిన ఎందరో శిష్యులు ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో కీలకంగా మారారు. 12 మంది సభ్యులున్న ఈ ముఠా రెండు జట్లుగా విడిపోయి లారీ హైజాక్‌లకు పాల్పడుతోంది. ఇప్పటికే 12కు పైగా హత్యలకు పాల్పడిన ఈ గ్యాంగ్ వెనుక వెలుగుచూడని కేసులెన్నో ఉన్నట్లు తెలుస్తోంది.

     

    ముఠాలో మొత్తం 12 మంది సభ్యులు



    గుండుగల్లు శ్రీరాములు ఈ నేరాలకు ఆధ్యుడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తొలుత చిన్నచిన్న మోసాలతో ప్రారంభమై ప్రస్తుతం నరహంతక ముఠాకు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. హత్యలు చే యడంలో సిద్ధహస్తుడు. సెంట్రల్ జైలు లోనే పలు ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. తనకు అవసరమైన అనుచరులను జైలు నుంచే సిద్ధం చేసుకుంటాడు. ఇప్పుడు ఇతని గ్యాంగ్‌లో ఉన్న పలువురు వేలూరు సెంట్రల్ జైలు లో పరిచయమైన వారుగా తెలుస్తోంది. శివకుమార్, రోషన్, జనార్ధన్, మురళి, భరత్ ఓ జట్టుగా, సేట్ అలియాస్ జియావుద్దీన్, గోపి, మహబూబ్‌బాషా, ఆచారిబాషా, వరదరాజులు, సిరాజ్ మరో జట్టుగా హైజాక్‌లకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు శ్రీకాళహస్తి జైలులో ఉన్నారు.

     

    కోట్ల విలువైన కాపర్ లారీలే  వీరి టార్గెట్..



    తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతం లో పలు కాపర్ కర్మాగారాలున్నాయి. అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు కాపర్‌తో బయల్దేరే లారీల గురించి స్థానికంగా ఉన్న కొందరు వీరికి సమాచారం అందజేస్తారు. రహదారిలోని డాబాల వద్ద కాపర్ లారీలు ఆగినపుడు అక్కడ ప్రయాణికుల వలే ఆ లారీల డ్రైవర్లకు పరిచయమవుతారు. ముగ్గురు లేదా నలుగురు ఆ లారీలో బయల్దేరితే ఆ లారీని ఫాలో చేస్తూ మరికొందరు ఎస్కార్ట్‌గా వెళతారు.

     

    ఇంతవరకు వెలుగుచూడని కేసులెన్నో



    ఈ గ్యాంగ్‌కు సంబంధించి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల్లో 12కు పైగా హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు వెలుగుచూడని కేసులు మరో పది దాకా ఉన్నట్టు సమాచారం. వీరు హత్య చేసిన డ్రైవర్లను ఏ మాత్రమూ అనుమానం రాకుండా పూడ్చిపెడతారు. అవి బయటపడితే తప్ప వీరి వ్యవహారం వెలుగుచూడదు.

     

    పరారైన వారికోసం గాలింపు..



    తమిళనాడు డ్రైవర్ల హత్య కేసులో నెల్లూరు జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి పరారైన జనార్ధన్, మురళి, భరత్ కోసం గాలిస్తున్నారు. వీరందరూ పలమనేరుకు చెందిన వారు కావడంతో ఇక్కడి పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. కొందరి కొత్త యువకుల పేర్లు సైతం వెలుగుచూడడంతో వారి గురించి కూడా విచారిస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top