ఓ తండ్రి ఆక్రందన!


► తనను బతకనివ్వాలంటూ 

    తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యక్తి నిరాహార దీక్ష

► పోలీసులు, తహసీల్దార్‌ పట్టించుకోలేదని ఆవేదన

► కన్నకొడుకులే ఈ దుస్థితికి కారణమంటూ కన్నీటిపర్యాంతం

 

 కన్న కొడుకులు పొమ్మన్నారు.. ఇంటికి వెళ్తే తాళం వేశారు.. భార్య విడిచిపెట్టింది. అందరూ ఉండి, అనాథై రోడ్డుపాలైన ఓ వ్యక్తి జీవితమిది. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నానని, తనను బతికించండంటూ ప్రాధేయపడుతూ అందరి కంటా కన్నీళ్లు తెప్పించాడు. ఈ సంఘటన సోమవారం పలాసలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 



కాశీబుగ్గ : పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన తెప్పల ధర్మారావు డిప్లమో చదివి హిందుస్తాన్‌ మోటార్‌ కంపెనీ(కోల్‌కత్తా)లో ఉద్యోగం చేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరినీ బాగాచ దివించి, ప్రయోజకులను చేశాడు. కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారుల కుమార్తె, సొంత మేనమామ కూతురైన భార్య.. పిల్లలు చదువుతున్న సమయంలోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం కుమారులిద్దరూ పెళ్లిళ్లు జరిగి స్థిరపడ్డారు. వారిలో పెద్ద కుమారుడు దేవేంద్రవర్మ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు.



పూణేలో ఉద్యోగం చేస్తూ, హైదరాబాదులో చేస్తున్నట్లు చిరునామా ఇచ్చి తప్పించుకుంటున్నాడు. ధర్మారావు పేరున ఉన్నటువంటి 30 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో రాయించుకొని తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. చిన్నకొడుకు సురేంద్రవర్మ బ్రాహ్మణతర్లా గ్రామంలో మెడికల్‌ ప్రాక్టిషనర్‌(ఆర్‌ఎంపీ)గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు తండ్రి వద్ద డబ్బును, భూమిని తీసుకొని రోడ్డున వదిలేశారు. ఆకలేస్తుందని ఇంటికి వెళ్లిన ప్రతిసారీ.. కోడళ్లు తలుపులకు తాళాలు వేసి బయటకు పొమ్మంటున్నారని ధర్మారావు కన్నీటిపర్యాంతమయ్యాడు. విషపదార్థాలు కలిపిన భోజనం ఇచ్చి తనను చంపాలని చూశారని ఆవేదన చెందాడు.



ఏడాది నుంచి బ్రాహ్మణతర్లా బస్టాండ్‌లో పడుకుంటున్నానని, చుట్టుపక్కల వారంతా గంజి పోస్తే తాగుతున్నానని వాపోయాడు. తాను చావుకు దగ్గరగా ఉన్నానని, ఈ నిరసన ద్వారా తన బాధను వ్యక్తం చేస్తున్నానని సోమవారం పలాస తహసీల్దార్‌ ముందు కన్నీరుపెడుతూ అందరి హృదయాలనూ కదిలించాడు.



ఫోర్జరీ సంతకాలంతో భూములను రాయించుకున్నారని కలెక్టర్‌ లక్ష్మీనరసింహంతోపాటు.. టెక్కలి ఆర్‌డీఓ వెంకటేశ్వరరావు, పలాస తహసీల్దార్, కాశీబుగ్గ పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేశానని తెలిపాడు. వారెవరూ పట్టించుకోలేదని అధికారుల తీరును ఎండగట్టాడు. చివరికి తన వద్ద ఉన్న నగదును ఖర్చు పెట్టి.. ఫోర్జరీ సంతకాలు చేసిన వైనంపై పలాస తహసీల్దార్‌కు కోర్టు నోటీసును సైతం పంపించాడు. ఈ నిరసనకు స్పందించిన పలాస తహసీల్దార్‌ కల్యాణ చక్రవర్తి.. ఆయనతో మాట్లాడారు. నెలరోజుల్లో న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top