వణికించిన భూకంపం


ఒంగోలు: నిద్రమత్తు వదిలించుకుంటున్న వారు కొందరైతే ఇంకా గాఢ నిద్రలో ఉన్నవారు మరికొందరు. ఇంతలో ఒక రకమైన ధ్వనితో వారంతా కంపించిపోయారు. బుధవారం ఉదయం 5 క్షణాలపాటు వచ్చిన ఈ వింత శబ్దం ఏమిటో అర్థం చేసుకునేలోగానే అటకల మీద ఉన్న వస్తువులు కిందపడిపోయాయి.


ఏం జరిగిందో తెలుసుకునేలోపే మరికొద్ది నిమిషాల తరువాత మారోమారు ప్రకంపనలు రావడంతో భూకంపం వచ్చిందని గుర్తించి ఇళ్లల్లో నుంచి జనం వీధుల్లోకి పరిగెత్తారు. ఉదయం 6.09 గంటలకు ఒక తరంగంలాగా భూమిలో నుంచి వింతైన శబ్దం వినిపించింది. మరో 8 నిముషాలకు అంటే 6.17 గంటలకు మరోమారు ఇదే పరిస్థితి. దీంతో ఏదో జరగబోతుందంటూ అందరూ ఉలిక్కిపడ్డారు.  భూకంప కేంద్రం జిల్లాలోని ద్రోణాదుల అని తెలియడంతో ఆందోళన హెచ్చింది.



 60 నుంచి 70 కి.మీ మేర ప్రకంపనలు:

భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4 పాయింట్లుగా నమోదైంది. అయితే దీని నుంచి ప్రారంభమైన ప్రకంపనలు మాత్రం సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు భూమిలో వ్యాపించాయి. ప్రకాశం జిల్లాలోనే కాకుండా గుంటూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. దీని ప్రభావంతో మార్టూరు, కొరిశపాడు, పర్చూరు, చీరాల, అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, చీమకుర్తితోపాటు  ఒంగోలు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, దర్శి, చినగంజాం, ఇంకొల్లు, కొండపి మండలాల్లో కూడా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి.  భూకంపం వచ్చిందంటూ  జనం వీధుల్లోకి పరిగెత్తారు. చిన్న పిల్లలను సైతం పొదివి పట్టుకొని ప్రాణభయంతో పరుగులు పెట్టారు. జనం ఈ సంఘటన నుంచి తేరుకోవడానికి దాదాపు అర్ధగంటపైనే పట్టింది. ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన గుంటూరు జిల్లాలోని మద్దిరాల, రాజాపేట, యడవల్లి, మురికిపూడి, శావల్యాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు కనిపించడం గమనార్హం.

 

దీనిపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ స్పందించారు. ప్రకంపనలు తమ ఇంటివద్ద కూడా కనిపించాయన్నారు. భూప్రకంపనలకు సంబంధించి జియాలిజిస్టులతో మాట్లాడి కారణాలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో భూగర్భ ఖనిజ సంపదను వెలికితీసేందుకు విస్తృతమైన తవ్వకాలు చేపడుతున్నందునే ఇటువంటి భూప్రకంపనలు తరుచుగా కనిపిస్తున్నాయని జనం భావిస్తున్నారు.


ప్రస్తుతం ప్రకంపనల తీవ్రత తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో పెద్దగా వస్తాయేమో అనే భయం మాత్రం ప్రజలను వెంటాడుతోంది. అయితే కొంతమంది మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో  తరుచుగా భూమిలోపలి పొరల్లో మార్పులు జరుగుతుండడం సహజమని, ఆ నేపథ్యంలో వచ్చిన స్వల్ప ప్రకంపనలే అని పేర్కొంటున్నా కచ్చితమైన సమాచారం ఏమిటనేది తెలియరావడంలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top