269 కోట్ల డబ్బు, 132 కోట్ల లీటర్ల మద్యం పట్టివేత!

269 కోట్ల డబ్బు, 132 కోట్ల లీటర్ల మద్యం పట్టివేత! - Sakshi

ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో కొనసాగుతోంది. క్రీడా పోటిలో పతకాల వేటలో.. లేదా దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందనో అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అక్రమంగా తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడిన సొమ్ము ఇప్పటి వరకు 129 కోట్లు అని ఎన్నికల కమిషన్ పరిశీలకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 269 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 

 

అక్రమంగా తరలిస్తున్న డబ్బును అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నామని.. ఆతర్వాత మహారాష్ట్ర 33.46 కోట్లు, తమిళనాడులో 9.87 కోట్లు, కర్నాటకలో 12.29, ఉత్తర ప్రదేశ్ లో12 కోట్లు, పంజాబ్ 5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని..ఇంకా ఇతర రాష్ట్రాల్లో స్వల మొత్తంలో పట్టుకున్నామని అధికారులు తెలిపారు. 

 

డబ్బే కాకుండా 132 కోట్ల లీటర్ల మద్యం, 104 కేజిల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వ్యవహారంలో 12 వేల మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామన్నారు.  లోకసభ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఆదాయపన్ను శాఖ, కస్టమ్స్ ఎక్సైజ్, ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగులను జట్లుగా నియమించారు. మార్చి 5 తేది నుంచి ఈ జట్లు దేశవ్యాప్తంగా అక్రమ డబ్బు, నల్లధన తరలింపును అడ్డుకుంటున్నారు.

 

గత ఎన్నికలతో పోల్చుకుంటే 2014 ఎన్నికల్లో అక్రమ ధనం తరలింపు ఎక్కువగానే ఉందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మరికొన్ని కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పెద్ద మొత్తంలో అక్రమ ధనాన్ని స్వాధీనం చేసే అవకాశం ఉందంటున్నారు. ఓటర్లను మభ్యపెట్టకుండా, వివిద మార్గాల ద్వారా డబ్బు తరలింపును ఎన్నికల కమిషన్ అధికారులు అడ్డుకుంటున్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top