సెలవు పెడితే ఉద్యోగం నుంచి తొలగించారు


కుమార్తె చనిపోతే ఉద్యోగమిచ్చి...తీసేశారు...

సీఎం పేషీకి ఆర్థిక సాయం కోసం వినతి




సీతంపేట: ఆయనకు అవుట్ సోర్సింగ్ కింద ఓ చిరుద్యోగం ఇచ్చారు. విధుల నిర్వహణలో ప్రమాదానికి గురైన ఆయన కొద్ది రోజుల పాటు సెలవు పెట్టి ఇంటికి వెళ్లాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ ఉద్యోగం చేసేందుకు వస్తే నీ ఉద్యోగం అవుట్ అంటూ అధికారులు నెమ్మదిగా సెలివిచ్చారు. దీంతో ఏం చేయూలో తెలియని స్థితిలో లబోదిబోమంటున్నాడు.



వివరాల్లోకి వెళ్తే.. బూర్జగూడ గ్రామానికి చెందిన ఆరిక భాగ్యలక్ష్మి కేజీబీవీలో చదువుతూ 2011లో డిసెంబరు 11న ఆటలాడుకుంటూ కింద పడి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆనందరావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా కుమార్తె మృతితో అప్పట్లో అధికారులకు తనకు సాయం చేయూలని మొర పెట్టుకున్నాడు.



దీంతో అప్పటి పీవో కె.సునీల్‌రాజ్‌కుమార్ మల్లి గిరిజన గురుకుల పాఠశాలలో వంట సహాయకునిగా బాలిక తండ్రి ఆనందరావుకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. ఉద్యోగంలో చేరి గత ఏడాది వరకు పని చేశాడు. ప్రమాదవశాత్తు అన్నం వండే అండా కిందకు దించుతుండగా గంజి కాలిపై పడి కాలిపోవడంతో సెలవు పెట్టి ఇంటికి వచ్చేశారు. ఆరోగ్యం బాగయ్యాక పాఠశాలకు మళ్లీ ఉద్యోగం నిమిత్తం వెళ్లాడు. అయితే అక్కడి ఉద్యోగులు తీసేశామని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో ఆనందరావు చేసేదిలేక కలెక్టర్ గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. ఆర్థిక సాయం కోసం సీఎం పేషీకి ఇక్కడి అధికారులు లేఖ రాశారు. ఈ విషయమై గిరిజన గురుకులం సెల్ ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా ఆనందరావే ఉద్యోగం మానేశాడని ఎవరూ తీయలేదని చెప్పడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top