కలకలం


 ‘కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎంతో మంది దర్జాగా తిరుగుతున్నారు.. బలసాకు తినైనా బతికుండొచ్చు.. ఊరొదిలైనా గండం నుంచి తప్పించుకోయిండచ్చు.. ఇంతగా అప్పులున్నాయని చెప్పింటే అందరం కలిసి ఏదైనా చేసి ఉండేవాళ్లం.. ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదు.. పసి పిల్లలేం చేశారు.. వారినెవరైనా పెంచుకుని ఉండేవారు కదా?.. అయినా వారికి ఎంత కష్టమొచ్చింటేనో ఇలా చేసుంటారు. బయటకు చెప్పుకోలేని బాధ మనకేం తెలుసు..’ - గుంతకల్లులో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న పప్పుశనగ వ్యాపారి చిరసాల బాబు (36) ఇంటి వద్ద మంగళవారం వినిపించిన మాటలివి.

 

 గుంతకల్లు టౌన్ : గుంతకల్లులో పప్పుశనగ వ్యాపారి బాబు కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త పట్టణంలో కలకలం రేపింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో వ్యాపారులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. వ్యాపారంలో నష్టం రావ డంతో అప్పులు పెరిగిపోయాయి.. ఇదే సమయంలో కొట్టాల రాజేష్ అనే వడ్డీ వ్యాపారి, అతని స్నేహితులు తీవ్రంగా అవమానించడంతో భరించలేని బాబు.. ఇద్దరు పిల్లలు యశశ్రీ (3), నవనీత్ (2)ను గొంతు నులిమి చంపి..  భార్య రాజేశ్వరి (28), అత్త జయలక్ష్మి (45)తో పాటు తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 అత్తమామలు, బావమరిదితో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకే ఇంట్లో ఉంటున్న వీరు కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు వెల్లడైంది. కుటుంబ మంతా కలిసి తనువు చాలించాలనుకున్నప్పుడు అత్త జయలక్ష్మి నివారించి ఉండాల్సిందని స్థానికులు చర్చించుకున్నారు.

 

 బాబు బావమరిది కాంత్రి.. తన తండ్రి శ్రీనివాసులును ఉద్యోగం చేసే చోట (రైల్వే) దిగబెట్టేందుకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. క్రాంతి ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని చూసి బోరున విలపించాడు. ‘‘నాన్నను రైల్వేస్టేష న్ వద్ద దిగబెట్టేందుకు వెళ్తున్నప్పుడు ‘నాన్నా.. మేము లేకున్నా బాగా చదువుకో’ అని అమ్మ చెప్పింది. అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతోందని అనుకుంటూ వెళ్లాను.. వచ్చి తిరిగి చూసేసరికి ఉరి వేసుకుంది. నన్ను, నాన్నను ఎవరు చూసుకుంటారమ్మా’’ అంటూ క్రాంతి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ‘సోమవారం రాత్రి యశశ్రీ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.

 

 హాయిగా.. అందరూ నవ్వుకుంటూ కనిపించారు.. ఇంతలో ఇలా చేసుకుంటారనుకోలేద’ంటూ సమీప ఇళ్లలోని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మునిసిపల్ చైర్మన్ కోడెల అపర్ణ సందర్శించి.. మృతుల బంధువులను పరామర్శించారు. అండగా ఉంటామని రైల్వే ఉద్యోగి శ్రీనివాసులుకు ధైర్యం చెప్పారు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఐదుగురి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పలువురి వద్ద రూ.30 లక్షలకు పైగానే అప్పులు తీసుకున్నట్లు తోటి వ్యాపారులు చర్చించుకోవడం కనిపించింది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top