బత్తాయి రైతు చిత్తు


పీసీపల్లి: బత్తాయి తోటలకు తెగుళ్లు ఆశించి..వేల ఎకరాల్లో కాయలు నేలరాలుతున్నాయి. పీసీపల్లి మండలంలో 4 వేల హెక్టార్లలో బత్తాయి తోటలు సాగు చేశారు. ఈ ఏడాది తెగుళ్లు సోకడంతో దాదాపు 2 వేల హెక్టార్లలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మరో 700 ఎకరాల్లో తోటలు నిలువునా ఎండిపోయాయి.



 వడపు తెగులు, దోమపోటుతో తీవ్ర నష్టం

 వడపు తెగులుకు తోడు, దోమపోటు బత్తాయి తోటలను నష్టపరుస్తున్నాయి. ఇవి సోకిన తోటల్లో ఒక్కరోజులోనే చెట్టుకున్న కాయలన్నీ పండుగా మారి రాలిపోతున్నాయి. దీంతో బత్తాయి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఎకరాలకు ఎకరాలు తెగుళ్లు ఆశించి..రైతులు లబోదిబోమంటున్నారు.  



 తగ్గిన బత్తాయి దిగుబడులు, ధరలు

 బత్తాయి చెట్లకు ఉడప తెగులు సోకడంతో దిగుబడి సగానికిపైగా తగ్గిపోయింది. ఎకరా తోటలో 20 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా..పది టన్నులకు తగ్గింది. దీనికి తోడు ధరలు కూడా దిగజారి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నెల క్రితం టన్ను బత్తాయి ధర రూ.25 వేలు పలకగా..ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10 వేల వరకు తగ్గడంతో రైతులు అల్లాడుతున్నారు. దళారులు ధరలు దిగ్గోసి రైతులను ముంచుతున్నారు.  



 కన్నెత్తి చూడని ఉద్యానవన శాఖ: తెగుళ్లు సోకిన బత్తాయి తోటలను ఉద్యానవనశాఖాధికారులు కన్నెత్తి చూడటం లేదు. సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో  రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనిగిరి ఉద్యానవనశాఖ కార్యాలయానికెళ్తే..ఎప్పుడూ ఆ కార్యాలయం మూసేసి ఉంటుందని..సమాధానం చెప్పేవారే కరువయ్యారని గోగడ వెంకటరమణయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.  



 ఊసే లేని సబ్సిడీ పథకాలు: బత్తాయి రైతులకు అందాల్సిన సబ్సిడీ పరికరాలు, ఎరువులు ఎటుపోతున్నాయో..ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదని రైతులు చెబుతున్నారు. ఎండిన చెట్లకు నష్టపరిహారం అందిస్తామని రాసుకెళ్లిన అధికారులు ఏ ఒక్క రైతుకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు.  



 విద్యుత్ సక్రమంగా ఇవ్వాలి -వెన్నపూస మాలకొండయ్య, పీసీపల్లి

 వర్షాలు లేవు. బోర్లతో నీరు పెట్టుకుందామన్నా..సక్రమంగా కరెంటు ఉండటం లేదు. విద్యుత్ సక్రమంగా ఇచ్చి పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి. నేను నాలుగు ఎకరాల్లో బత్తాయి తోటలు సాగుచేశాను. ఎటువంటి సబ్సిడీ పథకాలు, ఎరువులు అందలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top