ఆపరేషన్ కొల్లం


సాక్షి ప్రతినిధి, కడప:

 కొల్లం గంగిరెడ్డి ఇంతకాలం హాట్ టాఫిక్. కొల్లం బ్రహ్మనందరెడ్డి ఇప్పుడు సరికొత్త టార్గెట్. డీసీసీబీ రుణాలు మంజూరులో అవకతవకలంటూ కేసు నమోదు, ఆ వెనువెంటనే డీఐజీ స్థాయి అధికారి విచారణ.. ఆగమేఘాలపై ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటున్నాయి. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ పరుగులు పెట్టడం చూస్తే ఆపరేషన్ ‘కొల్లం’ ధ్యేయంగా ప్రభుత్వం నడుచుకుంటుందా.. అంటే అవుననే విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొల్లం కుటుంబమే  లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టక మునుపే కొల్లం గంగిరెడ్డి వల్ల ప్రాణహాని ఉందని ప్రకటించారు. అప్పట్లో ఆ ప్రకటన సంచలనం రేపింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోయే నాయకుడి ప్రకటనతో రాష్ట్ర యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆ వెనువెంటనే ఒకదాని వెంట ఒకటి విచారణ,, ఆపై కేసులు నమోదు అవుతూ వచ్చాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏకకాలంలో ఒకే అంశంపై తీవ్రస్థాయిలో ఒత్తిడిగా వ్యవహరించడాన్ని రాజకీయ కక్షగా పలువురు వర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మరుక్షణం నుంచి కొల్లం గంగిరెడ్డి లక్ష్యంగా విచారణ తీవ్రతరం అయినట్లు పలువురి భావన.

 సరికొత్త టార్గెట్ బ్రహ్మానందరెడ్డి....

 రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ముందే పసిగట్టిన కొల్లం గంగిరెడ్డి విదేశాలకు పరారి అయ్యాడు. దీంతో ఆయన సోదరుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి లక్ష్యంగా ప్రభుత్వ ప్రస్తుత చర్యలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ముందుగా పుల్లంపేట మండలంలోని అనంతయ్యగారిపల్లె, అనంతంపల్లె, అనంతసముద్రం సహకార సంఘాల్లో విచారణ చేపట్టారు. అనంతసముద్రంలో పట్టాదార్ పాసుపుస్తకాలు లేకుండా రుణాలు ఇచ్చారనే కారణంగా అప్పటి డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి విచారణ అనంతరం చర్యలను నాలుగు వారాలకు వాయిదా వేయాలని, ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులు వెల్లడించినట్లు సమాచారం. అయినప్పటికీ కొల్లం బ్రహ్మానందరెడ్డిపై కడప ఒన్‌టౌన్‌లో కేసు నమోదైంది. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి ఉన్న తీవ్రమైన ఒత్తిడే ఇందుకు కారణమని  తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసేలోపు కేసు నమోదు చేయాలంటూ  ఆదేశించడంతో ఆగమేఘాలపై ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని జిల్లా స్థాయి అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఆ వెనువెంటనే ఏకంగా సీబీసీఐడీ డీఐజీ రమణకుమార్ విచారణ కోసం రంగంలోకి దిగారు. కొల్లం గంగిరెడ్డిపై ఉన్న వ్యక్తిగత కక్షను కొల్లం బ్రహ్మానందరెడ్డి వైపు మళ్లించినట్లు విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

 కమిషనర్ ఆదేశాల మేరకే....

 కొల్లం బ్రహ్మనందరెడ్డి సహకార సంఘం అధ్యక్షుడుగా ఉన్న అనంతసముద్రం సొసైటీలో విచారణపై నాలుగు వారాలు స్టేటస్‌కో ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అలాగే ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదని వివరిస్తూ ఆదేశాలు అందాయి. అయినప్పటికీ క్రిమినల్ కేసు నమోదు వెనుక రాష్ట్ర కమిషనర్ ఆదేశాలే కారణమని స్పష్టం అవుతోంది. కేసు నమోదు నేపధ్యంలో సీబీసీఐడి రంగ ప్రవేశం చేసి విచారణ చేబడుతున్నట్లు సమాచారం. కమిషనర్ ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని డీసీఓ చంద్రశేఖర్ సాక్షి ప్రతినిధికి ధ్రువీకరించారు. పట్టాదార్ పాసుపుస్తకం లేకుండా రుణాలు ఇచ్చారంటే అందుకు అధికారులు కూడా బాధ్యులే. వారి ప్రమేయం లేకుండా రుణాలు ఇచ్చే అవకాశమే లేదు. ఇవేవీ పట్టించుకోకుండా ఏకంగా అధ్యక్షుడిని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కక్షే ప్రధాన కారణమని తెలుస్తోంది.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top