ఆపరేషన్.. ఆకర్ష్

ఆపరేషన్.. ఆకర్ష్ - Sakshi


ఇతర పార్టీ కార్యకర్తలను ఆకర్షించాలని చంద్రబాబు ఆదేశాలు

గ్రామాలకు వెళ్లాలంటూ ప్రజాప్రతినిధులకు సూచన

పార్టీ బలోపేతంపైనే దృష్టి  సమస్యలు ఏకరువు పెట్టిన నేతలు


 

టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇతర పార్టీల్లోని వారిని ఆకర్షించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడారు.

 

విజయవాడ :  తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంపై చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వాన్ని, పార్టీని అనుసంధానం చేస్తూ ప్రజల వద్దకు పార్టీని తీసుకువెళ్లే పనికి శ్రీకారం చుట్టారు. తన బాటలోనే ఎంపీల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు పనిచేయాలంటూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలుగుదేశం రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశం తొలిసారిగా విజయవాడ బందరు రోడ్డులోని ఎ-కన్వెన్షన్ హాలులో  జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పెరుగుతాయని, అందువల్ల పార్టీ కేడర్‌ను పెంచాల్సిన అవసరం ఉందని నేతలకు సూచించారు.



టీఆర్‌ఎస్‌ను తప్పు పడుతూనే...



పార్టీలో కార్యకర్తలను చేర్చేందుకు ఇతర పార్టీల్లోని వారిని ఆకర్షించాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు బహిరంగసభలో మాత్రం టీఆర్‌ఎస్ వలసలను ప్రోత్సహిస్తోందంటూ ఆయన తప్పుపట్టడం గమనార్హం. పింఛన్లను ఆన్‌లైన్ చేసి బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు అందజేయడం, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రభుత్వ ఆలోచనలను నేతలకు వివరించారు. తాను ప్రవేశపెట్టిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు చైతన్య ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్బోధించారు.



కొల్లేరు వాసుల కష్టాలు తీర్చాలి...



ఈ సందర్భంగా పార్టీ నేత ప్రజల సమస్యలను ఏకరువు పెట్టారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొల్లేటి వాసుల కష్టాలను తీర్చుతామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, వాటిని ఇప్పుడు అమలు చేయాలని కోల్లేటి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు కోరారు. వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరారు.

 

రాజధాని రైతుల ఊసే లేదు...



సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తుళ్లూరు ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్న నూతన రాజధాని ఊసే ఎత్తలేదు. ఇక్కడ రైతులకు ఇచ్చే ప్యాకేజీపై చంద్రబాబు పార్టీ సమావేశంలో చర్చిస్తారని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది.

 

విరాళాల సేకరణ...



సమావేశం చివర్లో చంద్రబాబు హుదూద్ బాధితులకు సహాయం అందించేందుకు పార్టీ నేతల నుంచి విరాళాలు సేకరించారు. నూజివీడు, ముసునూరు ప్రాంత రైతులు రూ.10 లక్షలు, విజయవాడ బిల్డర్స్ అసోసియేషన్ రూ.25 లక్షలు, పలమనేరు ఇండస్ట్రీస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో పాటు పలువురు లక్షల రూపాయల చెక్కులను చంద్రబాబుకు అందచేశారు.

 

నందమూరి సోదరుల రాక!




విసృత స్థాయి సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాసరావులు డుమ్మా కొట్టారు. నందమూరి సోదరులు హరికృష్ణ, బాలకృష్ణ సమావేశానికి హాజరుకావడం విశేషం. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), తోట సీతామహాలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కిమిడి వెంకట్రావ్, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, సిద్దా రాఘవరెడ్డి, కొల్లు రవీంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top