పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే - Sakshi


పొరుగు జిల్లాల నుంచి ప్రారంభమైన ఇసుక రవాణా

సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిడి

పెద్ద పారిశ్రామిక వేత్తలకే కేటాయింపులు

సామాన్యులకు నో స్టాక్ క్యూ.మీ.ఇసుక రూ.2వేలపైటే


 

 ఇసుక రీచ్‌లు మూతపడి నాలుగు నెలలైంది. డిపోల్లో అమ్మకాలు నిలిచి మూడు నెలలు కావస్తోంది. సాక్షి వరుస కథనాలతో కదిలిన ప్రభుత్వం పొరుగు జిల్లాల నుంచి ఇసుకను రప్పించాలని నిర్ణయించిం ది. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జిల్లాకొస్తున్న ఇసుక కోసం పైరవీలు జోరు మొదలైంది. పెండింగ్ ఆర్డర్లను కాదని..సిఫార్సులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు.

 

విశాఖపట్నం: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద 3 లక్షల క్యూ.మీ ఇసుక కోసం చాంతాడంత ఆర్డర్ల జాబితా పెండింగ్‌లో ఉంది. ఈ జాబితాలో ఉన్న వారంతా దాదాపుగా బిల్డర్స్... బడా బాబులే. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలైన డాక్‌యార్డు, నావీ, డీఆర్‌డీఒ, స్టీల్ ప్లాంట్, ఎన్‌టీపీసీ వంటి సంస్థల్లో విస్తరణ పనులకు మరో 3లక్షల క్యూ.మీ.ఇసుక అవసరం ఉంది. రాష్ర్ట ప్రభుత్వంతో పాటు స్థానికసంస్థల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు కనీసం 2.50లక్షల క్యూ.మీ.వరకు అవసరమవుతుంది. ఇతర చిన్నా చితకా ప్రైవేటు నిర్మాణాల కోసం మరో 3లక్షల క్యూ.మీ. వరకు  అవసరం. ఇప్పటికిప్పుడు జిల్లా అవసరాలకు 12 లక్షల క్యూ.మీ ఇసుక అవసరమని అధికారుల అంచనా.



సాక్షి కధనాలతో కదిలిక

ఇసుక మాఫియా ఆగడాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమక్షంలో గతనెల 22న సమీక్షించి శ్రీకాకుళం జిల్లా నుంచి తొమ్మిదిలక్షల , విజయనగరం నుంచి 2లక్షల, తూర్పుగోదావరి నుంచి రోజుకు ఐదువేల క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుక సరఫరా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈనెల 1నుంచి జిల్లాకు ఇసుక రవాణా ప్రారంభమైంది. ముందుగా పెండింగ్ ఆర్డర్లకు సరఫరా చేసిన తర్వాతే కొత్తవి తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. గృహావసరాలకు తప్ప బల్క్ ఆర్డర్స్‌ను అసలు అనుమతించడం లేదు. అయితే బడాబాబులు మాత్రం వడ్డించే వాడు మనవాడేతే..అన్నట్టుగా మంత్రులు.. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అడ్డదారుల్లో ఇసుకను ఎగరేసుకు పోయేందుకు పావులు కదుపుతున్నారు.



ఎక్కువగా మంత్రి గంటా సిఫార్సులే: మంత్రి గంటా శ్రీనివాసరావు సిఫార్సులతో నగరంలోని బిల్డర్లు, బడాబాబులు ఎక్కువగా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. మంత్రుల సిఫార్సులంటే కాదన లేక సర్దుబాటు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. డిపోల వద్ద కాకుండా వీరికి నేరుగా ఆయా రీచ్‌ల నుంచే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో పక్క జిల్లాలో కొత్తగా గుర్తించిన మూడు రీచ్‌ల్లో 80వేల క్యూ.మీ ఇసుక అందుబాటులో ఉందని ప్రకటించారు. ప్రవాహం తగ్గడంతో శారద, వరాహ, పెద్దేరు నదితీరం వెంబడి అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు క్యూ.మీ.ఇసుక రూ.500లకు విక్రయించే వారు. ప్రస్తుతం పొరుగు జిల్లాల నుంచి రప్పిస్తున్నామనే సాకుతో అమాంతం రూ.1300లకు పెంచేశారు. రవాణాతో కలుపుకుని క్యూ.మీ. ఇసుక రూ.2వేలు దాటిపోతుంది. ఈ లెక్కన మూడు యూనిట్ల లారీ రూ. 18వేలకు  పైగానే ఉంది.ఆర్డర్స్‌కనుగుణంగా సరఫరా జరిగితే..అదే బ్లాక్‌మార్కెట్‌లో మాత్రం రూ.25 వేలపైనే ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top