ఎంత ఖర్చవుతుందో కాలమే చెబుతుంది

ఎంత ఖర్చవుతుందో కాలమే చెబుతుంది - Sakshi


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో కాలమే చెబుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానిని ఏ విధంగా నిర్మిస్తామనేది కేంద్రం ఇచ్చే సహాయం, మన వద్ద ఉన్న వనరులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కొన్ని ప్రాజెక్టులను బీవోటీ, మరికొన్నింటిని పీపీపీ విధానంతో ఇస్తామన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో శుక్రవారం రాత్రి కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు అయ్యన్న పాత్రుడు, నారాయణలతో కలసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు చాలాసార్లు ఢిల్లీ వచ్చాం. ప్రధాని, ఆర్థికమంత్రి, ఆయాశాఖల మంత్రులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం.





విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నాం. పొరుగురాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉన్నాయి. ఏపీ ఇబ్బందిలో ఉంది. పరిశ్రమల్లేవు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇవన్నీ అధిగమించాలంటే కేంద్రం సహకరించాలి. కేంద్రం సానుకూలంగా స్పందించింది’’ అని సీఎం చెప్పారు. కొత్త రాజధానిని చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో సమానంగా వృద్ధిచేసేవరకూ సాయం చేయాలని కోరామన్నారు. రాజధాని నిర్మాణానికి లాండ్‌పూలింగ్ ద్వారా 33 వేల ఎకరాలు సమీకరించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏమీ జరగకూడదని, ప్రాజెక్టులు రావద్దని కొందరు నేతలు జనాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.





వ్యవసాయభూముల్లో కాకుండా రాజధానిని అడవుల్లో నిర్మించలేము కదా అని అన్నారు. మే చివరలో కోర్ క్యాపిటల్‌పై నివేదిక వస్తుందని తెలిపారు. విశాఖలో రైల్వేజోన్ అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఏప్రిల్‌లో దీనిపై ప్రకటించేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన బదులిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని చెప్పారు. కొత్త రాజధానికి ‘అమరావతి’గా పేరు పెడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని సమర్థించారు. దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, ఇది చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారకాన్ని ఢిల్లీలో నిర్మించాలన్నారు.





జైట్లీ, షాలతో బాబు భేటీ:

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికమంత్రిత్వశాఖ చాంబర్లో జైట్లీని కలసిన సీఎం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులపై చర్చించారు. అమిత్ షాతో భేటీ విషయాన్ని అడగ్గా.. ఏపీ విభజన చట్టంలోని అంశాలతోపాటు బీజేపీ, టీడీపీ సమన్వయంపై చర్చించినట్టు చెప్పారు. భూసేకరణ బిల్లును సమర్థిస్తున్నట్టు బాబు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top