కుటుంబానికి ఒకటే పింఛన్


* మంత్రులు, డ్వాక్రా సంఘాలు, అధికారులతో వీడియో సమావేశంలో సీఎం మరో కొత్త మెలిక

* అవకతవకలు జరిగితే సంబంధిత మంత్రులు, కమిటీలు, అధికారుల నుంచి రికవరీ

* రోజూ రెండు గ్రామ సభల్లో పాల్గొంటా

* జన్మభూమి సభల తర్వాత గ్రామానికో విజన్ డాక్యుమెంట్

* పాలనంతా ఐ ప్యాడ్ల ద్వారానే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుటుంబానికి ఒకటే పింఛన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక కేసుల్లో ఏదైనా కుటుంబానికి మరో పింఛన్ ఇవ్వాల్సి వస్తే జిల్లాస్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మంజూరు చేయాలని చెప్పారు. శనివారం తన క్యాంపు కార్యాలయం లేక్ వ్యూ అతిథి గృహం నుంచి స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాలు, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలు, అధికారులతో 3 గంటల పాటు వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అర్హులకు పింఛన్లను అందించడం, పరిశీలనే మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని, ఈమేరకు మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు.

 

 పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత మంత్రులు, కమిటీలు, అధికారుల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో నిర్దయగా వ్యవహరిస్తానని తెగేసి చెప్పారు. పింఛన్ సొమ్ము లబ్ధిదారునికి చేరిన సమాచారాన్ని వారి మొబైల్ ఫోన్లకు అందిస్తామని తెలిపారు. పింఛన్ల కోసం ఏడాదికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 2 నుంచి జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని అధికారులు ఎంత వినూత్నంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరొస్తుందని, మనసు పెట్టి ఈ సభలు జరపాలని సూచించారు. గ్రామ కార్యదర్శి, సర్పంచి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు సమిష్టిగా పనిచేయాలన్నారు.

 

  జన్మభూమి సభల అనంతరం గ్రామానికో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీ గ్రోత్ సెంటరుగా మారాలని ఆకాంక్షించారు. గ్రామసభల్లో ప్రజలు ప్రస్తావించే సమస్యల పరిష్కారంపైనా సమీక్ష ఉంటుందన్నారు. తాను ప్రతిరోజూ రెండు గ్రామ లేదా వార్డు సభల్లో పాల్గొంటానని చెప్పారు. గ్రామసభల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రతి గ్రామానికి వైద్యుల్ని పంపుతామన్నారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులను ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు రిఫర్ చేస్తారని తెలిపారు. ఈ పథకంలో మరో వంద వ్యాధుల్ని కలిపామన్నారు. కంటి ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 1,340 పశు వైద్య శిబిరాలు నిర్వహించేందుకు 1,300 బృందాల్ని పంపుతున్నామన్నారు. 45 లక్షల మేకలు, గొర్రెలకు వ్యాక్సిన్లు ఇస్తారని, 5.5 లక్షల గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ పరీక్షలు చేస్తారని చెప్పారు. వంద రోజుల పాలనపై పుస్తకాలు ముద్రించామని, వీటి ద్వారా డ్వాక్రా సంఘాలుప్రచారం చేయాలని సూచించారు.

 

 ప్రభుత్వ పాలనంతా ఐప్యాడ్ల ద్వారానే..

 ఇకపై ప్రభుత్వ పాలనంతా ఐప్యాడ్ల ద్వారానే నిర్వహిస్తామని సీఎం చెప్పారు. మంత్రులకు ఇప్పటికే ఐప్యాడ్లు ఇచ్చామని, త్వరలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకూ ఇస్తామని తెలిపారు. ఆతర్వాత జిల్లా, మండల స్థాయి అధికారులకూ ఇవ్వాలనే యోచన ఉందన్నారు. డ్వాక్రా సంఘాలకు, విద్యార్థులకు ఐప్యాడ్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ గ్రిడ్ ద్వారా డిజిటల్ ఇండియాకు ఊతమిస్తామన్నారు.

 

  ప్రతీ పంచాయతీకి బీటీ రోడ్డు లక్ష్యమన్నారు. గ్రామాల్లో ఎల్పీజీ సిలిండర్లు, పట్టణ ప్రాంతాలకు పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేసేం దుకు  గ్రిడ్ రూపొందించామన్నారు. దీనికోసం కేజీ బేసిన్‌లో గ్యాస్ కోసం పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 20 శాతం మంది కూడా మరుగుదొడ్లు వాడటంలేదని సీఎం చెప్పారు. వీటి నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా చేపడతామని, ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకానికీ ఆధార్ లింకేజి తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.  

 

 అసెంబ్లీలో మాట్లాడినట్లు మాట్లాడితే ఎలా?

 వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల నుంచి మంత్రులు కొందరు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన పలువురు మంత్రులకు సీఎం చురకలంటించారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడినట్లు మాట్లాడితే ఎలా? కేబినెట్ సమావేశాలు మీకు సరిపోతాయి’’ అని వ్యాఖ్యానించారు. గుంటూరు నుంచి సమావేశంలో పాల్గొన్న మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘‘పనిచేసే వాళ్లకి మాట్లాడే అవకాశమిస్తే మీరెందుకు లైన్‌లోకి వస్తున్నారు’’ అంటూ సీఎం అడ్డుకున్నారు. తనకు చివరి అవకాశమని మంత్రి రావెల అనగా.. ‘‘క్లారిటీ ఇవ్వాల్సింది మీకు కాదు. కిందిస్థాయి అధికారులకు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పలుసార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ను ఆషామాషీగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని చోట్ల అధికారులు ఫోన్‌లో మాట్లాడటాన్ని తప్పు పట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై అధికారులకు సీఎం క్లాసు తీసుకున్నారు.

 

 జన్మభూమిలో పింఛన్ల తనిఖీ

 ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం లో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను తనిఖీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జన్మభూమి-మా  ఊరు పేరుతో వచ్చే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 వేల గ్రామ పంచాయితీల్లో, పట్టణాల్లోని వార్డుల్లో అధికార, ఉద్యోగ యంత్రాంగం పర్యటించనుంది. ఇందుకోసం మండలాల వారీగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. విధివిధానాలను ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top