రేషన్‌కు సర్వర్ చిక్కులు


బేస్తవారిపేట: రేషన్ కార్డులకు ఆధార్ నమోదు ప్రక్రియకు సర్వర్‌లో సమస్య తలెత్తింది. కార్డుదారులకు సంబంధించిన ఆధార్ నంబర్లను రెవెన్యూశాఖ అధికారులకు డీలర్లు అందించినప్పటికీ కార్డులకు ఆధార్ అనుసంధానం కాలేదు. ఒక్క బేస్తవారిపేట మండలంలోనే 11748 కార్డుల్లో ఉన్న 42,617 మందిలో 8,729 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. డీలర్లు ఒకటికి రెండు సార్లు ఆధార్ నంబర్లను ఇచ్చినప్పటి కీ సర్వర్‌లో ఉన్న సమస్యతో అనుసంధానం కావడం లేదు.



జిల్లా అంతటా ఇలాంటి సమస్య తలెత్తడంతో ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకెళ్లారు. ప్రతినెల 16వ తేదీన తహ శీల్దార్ కార్యాలయంలో డీలర్లకు తహశీల్దార్ సమావేశం ఏర్పాటు చేసి స్టాక్ వివరాలు నమోదు చేసుకుంటారు. జేసీ ఆదేశాల మేరకు రేషన్ అలాట్‌మెంట్ వస్తుంది. 20, 21వ తేదీల్లో డీలర్లు అలాట్‌మెంట్ ప్రకారం డీడీలు తీయాలి. 23వ తేదీకి తీసిన డీడీలను రేషన్ గోడౌన్ డీటీకి అందజేయాలి. 25వ తేదీ నుంచి అన్నీ మండలాల్లోని మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు లారీల్లో రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. ఒకటో తేదీ నుంచి రేషన్ సరఫరా చేయాల్సి ఉంది.



నేటికీ జేసీ నుంచి అలాట్‌మెంట్ రాకపోవడంతో డీలర్లు డీడీలు చెల్లించలేదు. సర్వర్‌లో వచ్చిన సమస్యను అధికారులు పరిష్కరించకపోవడంతో సకాలంలో పేదలకు రేషన్ పంపిణీ జరిగే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 8.90 లక్షల మంది తెలుపు రంగు కార్డుదారులున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,085 ప్రజాపంపిణీ దుకాణాల్లో వేల సంఖ్యలో కార్డుదాల ఆధార్ నమోదు జరగలేదు.



 అయోమయంలో డీలర్లు

 సక్రమంగా ఆధార్ నంబర్లను అందజేసినప్పటికీ ఒకే కుటుంబంలో ఒకరిద్దరికి ఆధార్ అనుసంధానం చేయకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రేషన్‌షాపు పరిధిలో 75 నుంచి 405 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. కుటుంబంలో ఒకరిద్దరికి ఆధార్ అనుసంధానం జరగకపోవడంతో గ్రామాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.



 ఆధార్ అనుసంధానమైన వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేయాల్సి వస్తే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుందోనని భయపడుతున్నారు. ప్రారంభంలో కార్డులకు ఆధార్ అనుసంధానం చేసేటప్పుడు సమస్యలు వచ్చాయి. జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. నూరు శాతం రేషన్‌కార్డులకు ఆధార్ నమోదు కోసం సర్వర్‌లో ఉన్న లోపాలను పట్టించుకోకుండా ఆధార్ నంబర్  తీసుకోని వారిని రిజెక్ట్ కింద నమోదు చేశారు. నేడు సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top