కొన్నా.. కోసినా కన్నీళ్లే!

కొన్నా.. కోసినా కన్నీళ్లే!

► రూ.40కి చేరిన ఉల్లి


► పక్షం క్రితం కిలో రూ.14


► ధరలు రోజురోజూ పైపైకి


► సబ్సిడీ అమ్మకాలు వట్టివే

 


గత నెల 30న కిలో ఉల్లి రూ.14. అయిదు రోజుల క్రితం రూ.28. ఇప్పుడు కిలో ఉల్లి రూ.40కు చేరుకుంది. పక్షం రోజుల్లో ఉల్లి పైపైకి ఎగబాకడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ధరలను నియంత్రించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం.. సబ్సిడీ ఉల్లిపాయలను రైతు బజార్లలో విక్రయిస్తామని సైలెంట్‌గా ఉండిపోయింది.


 


చిత్తూరు: జిల్లాలో మళ్లీ ఉల్లిపాయల కొరత నెలకొంది. 2015వ సంవత్సరంలో ఇదే తరహాలో ఉల్లిపాయల డిమాండ్‌ ఏర్పడగా ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 40 రోజులకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉల్లి మరోమారు కొండెక్కగా ధరలను అదుపులో పెట్టడం, ప్రజలకు కావాల్సిన సరుకును తెప్పించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నష్టం.. లాభం లేకుండా ఉల్లి విక్రయాలు జరగాలనే ప్రతిపాదన నీటి మూటలుగా మారింది. దీనికి తోడు రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు విక్రయించాలనే సీఎం ఆదేశాలు జిల్లాలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు.


 


ఇదే కారణం..


జిల్లాలో రోజుకు అయిదు వేల టన్నులకు పైగా ఉల్లిపాయలు ఉత్తర భారత రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతోంది. ఇక్కడి రాష్ట్రాలైన ప్రస్తుతం భారీ వరదలు రావడంతో పంట మొత్తం నీట మునిగిపోయింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ తదితర రాష్ట్రాల వ్యాపారులు ఉల్లిపాయల కోసం మహారాష్ట్రకు వచ్చి ఉల్లిపాయలు కొనుగోలు చేస్తుండటంతో ఒక్కసారిగా ఉల్లికి డిమాండ్‌ పెరిగి ధరలు ఎగబాకాయి. ఈ ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడటంతో జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇక మనకు కర్నూలు నుంచి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా.. మహారాష్ట్ర సరుకుతో పోలిస్తే మన ఉల్లిలో నాణ్యత లేకపోవడం, నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉండకపోవడంతో ప్రజలు వీటిని కొనడానికి ఆసక్తి చూపడంలేదు.


 


సీఎం మాటలు వట్టివే..


ఉల్లి డిమాండ్, ధరలు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, రైతు బజార్ల సీఈవోలు, పౌరసరఫరాల శాఖ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయించాలని ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిని అందించడంతో పాటు ప్రతీ రెండు గంటలకు ఇక్కడి అమ్మకాలపై సమీక్షలు చేయాలని ఆదేశించారు. ఇక అక్రమ నిల్వలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేసి సరుకును వెలికి తీయాలని కూడా పేర్కొన్నారు. ఇదంతా జరిగి అయిదు రోజులు కావస్తోంది. సీఎం మాటల్లో ఒక్కటి కూడా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. పైగా అయిదు రోజుల క్రితం రూ.28 ఉన్న కిలో ఎర్రగడ్డలు ఇప్పుడు ఏకంగా రూ.40కి చేరుకోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది.


 


దడ పుట్టిస్తున్నాయి..


ఇటీవల కాలంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితిగా మారింది. ఇప్పుడు ఉల్లి ధరను చూస్తే ఇదే రీతిలో ఉంది. « సామాన్యులు ఏం తినాలి.. ఎట్టా బతకాలి. రైతు బజారులో కూడా నిర్ణీత ధరకు కూడా విక్రయించడం లేదు. ప్రభుత్వం మాత్రం రాయితీతో అందిస్తామని కూడా చెప్పింది. కానీ ఇంత వరకు అమలులో లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. –రంజని, చిత్తూరు


 


ఉల్లిన్ని రాయితీతో అందించాలి..


కూరగాయల ధరలు మాత్రమే పెరిగాయి.. అనుకుంటే ఉల్లి ధర కూడా పెరిగిపోయింది. ఈ రోజుల్లో పని దొరకడమే కష్టంగా ఉంది. ఇలాంటప్పుడు ధరలు పెరిగితే సామాన్యుడు ఏమై పోవాలి. ప్రధానంగా ఉల్లి. వంటింట్లో ఉల్లి లేనిదే ఏ కూర వండాలన్నా కష్టమే. అధికారులు ధర నియంత్రణనకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాయితీతో ఉల్లిని అందించాలని కోరుతున్నాం. –భాగ్య, చిత్తూరు


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top