ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి


గుమ్మలక్ష్మీపురం/కురుపాం: కురుపాం మండలం పల్లంబారిడి గ్రామ సమీపంలోని మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం ఓ ట్రాక్టర్ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. కురుపాం మండలం మరిపల్లి గ్రామానికి చెందిన 16 మంది గిరిజనులు గుజ్జువాయి పంచాయితీ గోర్జిపాడు గ్రామానికి ఎగువన ఉన్న ఊటమానుగూడలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనున్న క్రైస్తవ పండగల కోసం ఈత కొమ్మలను తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరిక సుబ్బారావు (16) అనే యువకుడు అక్కడి కక్కడే మృతిచెందాడు.

 

 సుబ్బారావు ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 7.8 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతలోనే అతడు మరణించటంతో తల్లిదండ్రులు తులసి, యేసోన్, బంధువులు బోరున విలపించారు. ప్రమాదం గురించి తెలియగానే పల్లంబారిడి గ్రామస్తులు వచ్చి ట్రాక్టరు తొట్టెను లేపి దానికింద ఉన్న క్షతగాత్రులను మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడినవారిలో ఆరిక అనూష, ఆరిక శ్రీను, బిడ్డిక ఎల్లంగు, ఆరిక తీజన్‌కుమార్, ఆరిక బెనితో, బిడ్డిక నవీన్‌కుమార్, ఎ.మాస, ఆరిక సురేష్, ఎన్.రామారావు, ఆరిక సరోజిని, కామరాజు, ఆరిక జయరాజు, కవిత ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరిక అనూష అనే పదమూడేళ్ల బాలిక పరిస్ధితి విషమంగా ఉంది. మొండెంఖల్లు పీహెచ్‌సీ నుంచి క్షతగాత్రులు ముగ్గుర్ని మాత్రమే 108 వాహనంలో పార్వతీపురం తీసుకెళ్లగా మిగిలిన వారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు.

 

 అతివేగమే కారణం

 డ్రైవర్ రాజు ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన స్ధలాన్ని ఎల్విన్‌పేట ఎస్సై ఐ.గోపి పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

 

 అందుబాటులో లేని వైద్యులు

 మొండెంఖల్లు పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులు పనిచేస్తున్నప్పటికీ క్షతగాత్రులు వచ్చేసరికి ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. దీంతో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్యుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top