మరోసారీ..!

మరోసారీ..!

చేనేతలను మభ్యపెడుతున్న చంద్రబాబు

 

 

 ఎమ్మిగనూరు : ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్న సామెత ప్రస్తుత టీడీపీ పాలకులకు సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేనేత రంగం రూపు రేఖలు మారుస్తానని, చేనేతల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీపైనే స్పష్టత ఇవ్వలేదు. ఇక చేనేతల రుణాల ఊసే ఎత్తడంలేదు. రుణాలు మాఫీ అవుతాయని తమ బతుకులు బాగుపడతాయని చేనేతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా సీఎం చేనేతలకు ఎలాంటి భరోసా ఇవ్వడంలేదు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. అప్పుడు ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది. ఇప్పటి హామీల పరిస్థితి 

 ఏమిటో అర్థమవుతుంది. అపెరల్ పార్కు అటకెక్కించిన బాబు ఇప్పుడు టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేస్తామని చెప్పడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బాబు హయాంలో ఎంతో ఆర్భాటంగా అపెరల్ పార్కుకు వేసిన పునాది రాయి సమాధి రాయిని తలపిస్తోంది. ఇక టెక్స్‌టైల్ పార్కుకు కూడా అదే గతి పడుతుంది. 

 మరచిపోయారా..? వ్యవసాయ తర్వాత ఎక్కువ శాతం మంది ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎమ్మిగనూరుకు చేనేత పురిగా కూడా పేరుంది. సుమారు 12 వేల మగ్గాలతో 7 వేల కుటుంబాలు చేనేత వృత్తిలో ఉన్నాయి. ఎమ్మిగనూరు పరిసర ప్రాంతంలోని గుడేకల్, గోనెగండ్ల, నందవరం, నాగులదిన్నె, కోడుమూరులోని మరో నాలుగు వేల కుటుంబాలు కూడా చేనేత వృత్తిపై ఆధారపడి ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో నేతన్నల బతుకులు మరింత దిగజారాయి. చేయూత నివ్వాల్సిన చేనేత సొసైటీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉపాధిని చూపే స్పిన్నింగ్ మిల్లు మూతబడింది. ఆదుకోవాల్సిన సర్కార్ అలసత్వం ప్రదర్శించడంతో చేనేత రంగం జవసత్వాలు కోల్పోయింది. బాబు జమానాలో ఐదుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా 38 మంది స్పిన్నింగ్ మిల్లు కార్మికులు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందారు. ఆదరణ పథకం కింద బాబు హయాంలో కొంతమందికి చేనేత మగ్గాలను పంపిణి చేసినా అవి కూడా దళారుల దోపిడికి గురయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, నమ్ముకున్న వృత్తిలో గట్టెక్కలేక సుమారు 3 వేల మంది కార్మికులు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. మహిళలు హోటళ్లలో, ధనవంతుల ఇళ్లలో పని మనుషులుగా, ప్రైవేట్ సంస్థల్లో ఆయాలుగా చేరారు. పురుషులు లాడ్జిలలో రూమ్ బాయ్‌లుగా హోటళ్లలో సర్వర్లుగా, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలలో వాచ్‌మన్లుగా చేరారు. మరికొందరు  బెంగళూరు, ముంబాయి, చెన్నైకి వలస పోయారు.

 అపెరల్‌కు ఆనాడే అడ్డంకులు: ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్‌ను ఏర్పాటుచేసి చేనేతల కష్టాలు తీరుస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ నేతలు గతంలో ఎన్నికల వాగ్దానాలు చేశారు. 2004 ఫిబ్రవరి 15న అప్పటి చేనేత మంత్రి పడాల భూమన్న, మున్సిపల్ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అపెరల్ పార్క్ ఏర్పాటుకు బనవాసి వద్ద శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో 10 వేల మందికి ఉపాధిని కల్పించడమే లక్ష్యమని ఆర్భాటంగా ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే అపెరల్ పార్క్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం బనవాసి పశు వీర్యోత్పత్తి క్షేత్రానికి, జవహార్ నవోదయ విద్యాలయానికి అతి సమీపంలో ఉండడంతో బనవాసి అటవీ శాఖ అధికారులు అపెరల్ పార్క్ నిర్మాణానికి అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా బనవాసి అధికారుల వాదనలతో ఏకీభవించడంతో అపెరల్ పార్క్ నిర్మాణం బాబు జమానాలో మరో పునాది రాయిగానే మిగిలింది.

 చేయూతనిచ్చిన వైఎస్ సర్కార్: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగానికి వైఎస్ పాలన వరమైంది. రసాయనాల ప్రభావం, మర మగ్గాల ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం దశల వారీగా చేయూతనిచ్చింది. వృద్ధాప్య పెన్షన్‌ను చేనేత కార్మికులకు 50 ఏళ్లకే ఇచ్చేలా జీవో జారీ చేసింది. టీడీపీ హయాంలో ఎమ్మిగనూరుకు చెందిన 298 మంది 60 ఏళ్లు పైబడిన కార్మికులు పెన్షన్లు పొందితే వైఎస్ హయాంలో నెలకు రూ.200 చొప్పున 50 ఏళ్లు దాటిన 1586 మంది చేనేతలకు పెన్షన్ సదుపాయం లభించింది. క్లస్టర్ స్కీమ్‌లను ఏర్పాటు చేసి కార్మికులకు అవసరమైన నూలు, ముడి సరుకులను క్లస్టర్ ద్వారా ప్రభుత్వం పంపిణి చేసింది. ఆర్టీజన్ కార్డు, రుణ అర్హత కార్డులను జారీ చేసి కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు రుణ సదుపాయాన్ని కూడా కల్పించింది. వైఎస్ చొరవతో ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటికి చెందిన రూ.3.5 కోట్ల రుణాలు, చేనేతలకు చెందిన రూ.16.78 లక్షల వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయి. మహానేత వైఎస్ మరణాంతరం చేనేతల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. వైఎస్, రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చంద్రబాబు పాలనకు బ్లూ ప్రింట్‌గా కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ సర్కార్ సంక్షేమాన్ని, సంస్థల్ని నిర్వీర్యం చేేసిందనీ నేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 టెక్స్‌టైల్ పార్కు పేరుతో ప్రచారం: గతంలోని తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోంది. ఎమ్మిగనూరు-ఆదోని మద్య టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి చేనేతలకు చేయూతనిస్తామనీ సీఎం చంద్రబాబు, స్థానిక నాయకులు ఊదరగొడుతున్నారు. స్థలసేకరణ, నిధుల సమీకరణపై స్పష్టత లేకుండానే హంగామా సృష్టిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 

 

 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top